రామ్‌చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. `వినయ విధేయ రామ` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ పేరే ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు. ఆ రోజే టైటిల్ కూడా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కథ… కాస్త బయటపడింది. కథ చూస్తే.. `గ్యాంగ్ లీడర్`తో దగ్గర పోలికలు ఉన్నట్టు కనిపిస్తోంది.
గ్యాంగ్ లీడర్ గుర్తుంది కదా..? ముగ్గురు అన్నదమ్ముల కథ ఇది. చిన్నోడు (చిరంజీవి) బలాదూర్‌గా తిరుగుతుంటాడు. పెద్దోడ్ని (మురళీ మోహన్)ని విలన్ చంపేస్తాడు. ఆ సంగతి చిరంజీవికి తెలీదు. స్నేహితులకు తెలిసినా… చెప్పకుండా దాచేస్తారు. సేమ్ టూ సేమ్ ఈ కథలోనూ ఇలాంటి ట్విస్టే ఉందని సమాచారం. అన్నయ్య (ప్రశాంత్)ని విలన్ గ్యాంగ్ దారుణంగా చంపేస్తుందని, ఈ విషయం చిన్నన్నయ్య (ఆర్యన్ రాజేష్)కి తెలిసినా… బయటపెట్టడని.. చివరికి విషయం తెలుసుకున్న తమ్ముడు చరణ్… శత్రువులపై ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ సినిమా కథ అని సమాచారం. గ్యాంగ్ లీడర్ అప్పట్లో సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందని చరణ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు అనుకోకుండా.. అలాంటి కథనే బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. సో… గ్యాంగ్ లీడర్ రీమేక్ చేయాలన్న ఆశ ఇలా తీరబోతోందన్నమాట.