సరైన కథ, సరైన పాత్ర కుదరకపోవడం వల్ల రామ్‌చరణ్‌లో నటుడు ఇప్పటివరకూ బయటపడలేదేమో… తను సహజ నటుడు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ – సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చెప్పిన మాట. ‘రంగస్థలం’ చూశాక ప్రతి ఒక్కరూ చరణ్ సహజ నటుడని నేను చెప్పిన మాట సరైనదని అంటారని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదైనా సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు విడుదలకు ముందు హీరోలపై పొగడ్తల వర్షం కురిపించడం కామన్. ఒకవేళ రత్నవేలు కూడా అదే విధంగా పొడుగుతున్నారా? అనే డౌట్ రాకుండా ఆయన ఓక్ విషయం చెప్పారు. రజనీకాంత్ నుంచి చిరంజీవి వరకూ టాప్ స్టార్స్‌తో చేసిన నాకు ఇప్పుడు ఒకర్ని పొగడాల్సిన అవసరం లేదని, ఎవరినో ప్రసన్నం చేసుకోవలసిన అవసరం అంతకన్నా లేదని చెప్పారాయన. చరణ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పిన రత్నవేలు మరో ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టారు. రెండు మూడు టేక్స్ తర్వాత చరణ్ స్లో అవుతారట. అంతకు ముందు చేసినట్టు నటించలేరట. అదే చిరంజీవి అయితే ఎన్ని టేకులు తీసుకున్నా కొత్తగా నటిస్తారన్నారు.
ఓ సినిమా తర్వాత మరో సినిమా చేసే రత్నవేలు వరుసగా మెగా ఫ్యామిలీ సినిమాలు చేస్తుండటం విశేషం. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ‘రంగస్థలం’ చేశారు. దీని తర్వాత చిరంజీవి ‘సైరా’ చేస్తున్నారు. యాక్చువల్లీ… ‘సైరా’కు ముందు రవివర్మను తీసుకున్నారు. ఆయన స్థానంలో రత్నవేలు వచ్చి చేరారు. దీని గురించి అడిగితే… “రవివర్మ ఒక్క రోజు కూడా ‘సైరా’కు పని చేయలేదు. ఎవరైనా సినిమాటోగ్రాఫర్ ఏదైనా సినిమాకు ఒక్క రోజు వర్క్ చేసినా, నేను ఆ సినిమా టేకప్ చేయను. గతంలో కమల్ హాసన్ ‘దశావతారం’కి వేరే ఆటను రెండు మూడు రోజులు వర్క్ చేశాక, నన్ను చేయమంటే చేయనని చెప్పేశా. అసలు, ‘సైరా’కు ముందు నన్నే చేయమన్నారు. అప్పుడు ‘రంగస్థలం’తో బిజీగా వుండి చేయనన్నాను. తర్వాత అడిగితే కాదనలేకపోయా” అన్నారు రత్నవేలు.