సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిగా నటిస్తున్నాడహో… అంటూ రంగస్థలం మొదలైన కొన్ని రోజులకే సోషల్ మీడియా కోడై కూసింది. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అది నిజమా, కాదా అని మెగా ఫ్యాన్స్ తెగ కలవరించేశారు. ఇప్పుడు సుకుమార్ టీమ్ నోరు విప్పింది.. ‘టీజర్’ రూపంలో. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రంగస్థలం’ టీజర్ వచ్చేసింది. తొలి షాట్‌లోనే… రామ్‌చరణ్ చెవిటివాడని చెప్పేశారు. ‘సౌండ్ ఇంజనీర్’ అంటూ… చరణ్‌తోనే ఓ డైలాగ్ పలికించాడు సుకుమార్. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషులు.. అందులో… చిట్టిబాబు అనే చెవిటి మాలోకం… ఇదీ స్థూలంగా ‘రంగస్థలం’ కథ. టీజర్ మొత్తంగా చరణ్ పాత్రని చూపించడానికి తాపత్రయపడిన సుకుమార్… సమంత ని ఒక్క ఫ్రేమ్‌లోనూ చూపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సమంత అనే కాదు, మిగిలిన ఏ పాత్ర వైపూ కెమెరా ఫోకస్ చేయలేదు. రత్నవేలు కెమెరా పనితనం, దేవిశ్రీ ఇచ్చిన బీటు.. అదిరిపోయాయి. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కి నచ్చే టీజర్ ఇది. ‘సినిమాలో ఏదో కొత్తదనం ఉంది.. ఉంటుంది’ అని నమ్మేవాళ్ల నమ్మకాన్ని పెంచేలా టీజర్ ఉంది. మార్చి 30న ఈ సినిమా విడుదల కాబోతోంది. మిగిలిన పాత్రల్ని ఒక్కొటిగా సుకుమార్ పరిచయం చేస్తాడేమో చూడాలి.