తెలుగు సినిమా మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. రూ.50 కోట్ల మైలు రాయి ఇప్పుడు అందుకోవడం ఈజీనే. సినిమాలో సత్తా ఉంటే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు. చిన్న చిన్న సినిమాలు కూడా రూ.20 కోట్లు సాధించి.. నివ్వెర పరుస్తున్నాయి. అందుకే దానికి తగ్గట్టుగానే బడ్జెట్లు పెంచడానికి నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. డిసెంబరు ఆఖరి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?? అక్షరాలా రూ.65 కోట్లు. చరణ్ కమర్షియల్ హీరోనే. హిట్టు పడాలే గానీ… రూ.50 కోట్లు ఈజీగా కొట్టేస్తాడు. ఆ ధైర్యంతోనే నిర్మాత ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేశారని సమాచారం. పైగా సుక్కు కథ అంత బడ్జెట్‌ని డిమాండ్ చేస్తోందట. టెక్నీషయన్లు, సెట్లూ, నటీనటులు – సాంకేతిక నిపుణుల పారితోషికాలూ ఇవన్నీ భారీగా ఉండబోతున్నాయని అందుకే రూ.65 కోట్ల బడ్జెట్ లెక్క తేలిందని తెలుస్తోంది.
రామ్ చరణ్ నటించిన ధృవ డిసెంబరు 9న రాబోతోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లలోపే. ధృవ జయాపజయాలపై సుకుమార్ సినిమా బడ్జెట్ ఆధారపడి ఉండబోతోంది. ధృవ రూ.50 కోట్ల క్లబ్లో చేరితే.. ఓవర్సీస్లో మంచి వసూళ్లు దక్కించుకొంటే… చరణ్ సినిమాకి అనుకొన్న బడ్జెట్ కేటాయించడానికి నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవొచ్చు. అయితే ధృవ అంత కొడుతుందా? లేదా? అనేది చూడాల్సివుంది. చరణ్ సినిమాలకు ఓవర్సీస్లో పెద్దగా మార్కెట్ ఉండదు. కానీ సుక్కు సినిమాకి ఆ సౌలభ్యం ఉంది. నాన్నకు ప్రేమతో సినిమా ఓవర్సీస్ లో మంచి వసూళ్లు అందుకొంది. ఆ ధైర్యంతోనే ఈ సినిమాకి కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి నిర్మాత ధైర్యం చేస్తున్నాడని వినికిడి. ధృవ అటూ ఇటూ అయితే ఈ లెక్కలన్నీ మారిపోవొచ్చు. అందుకే సుక్కు అండ్ టీమ్.. ధృవ రిజల్ట్ కోసం ఎదురుచూస్తోంది.