దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా మళ్లీ హడావుడి ప్రారంభమయింది. అదే సమయంలో రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలిసంస్థ రూపొందించిన కరోనిల్ అనే మందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఫేక్ ప్రచారం ఉద్ధృతమయింది. అయితే కొద్ది గంటల్లోనే ఈ అంశం తీవ్ర వివాదాస్పమయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు వాడుకుని కరోనిల్‌ను మార్కెట్ చేసుకోవడానికి రాందేవ్ బాబా గట్టి ప్రయత్నమే చేశారు. ఇక్కడ జరిగే ప్రచారం అక్కడెలా తెలుస్తుందని అనుకున్నారో లేకపోతే.. ఇలాంటి వాటిని పట్టించుకోరని అనుకున్నారో కానీ నిర్మోహమాటంగా ప్రచారం చేసుకున్నారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి ఖండన ప్రకటన రావడంతో కిక్కురుమనలేదు.
అయితే ఇండియాలో కూడా.. కరోనిల్‌కు.. వైద్య పరంగా శాస్త్రీయమైనదంటూ ప్రచారం చేయడం గగ్గోలు రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్,మరో మంత్రి గడ్కరీ చేతుల మీదుగా కరోనిల్‌ను విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్ ఉందని ఆ కార్యక్రమంలో రాందేవ్ బాబా ప్రకటించారు. అదే సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేరు వాడుకున్నారు. డబ్ల్యూహెచ్‌వో ఖండించగా… భారత వైద్య సంఘం కూడా మండిపడింది.తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది.
నిజానికి ఈ మందును రామ్‌దేవ్ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అప్పట్లో వివాదం రేగడంతో కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి పని చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కరోనా రెండో విడత వస్తుందనుకున్నారో లేకపోతే.. స్టాక్ మిగిలిపోయిందని అనుకున్నారో కానీ రెండో సారి లాంచ్ చేసి… ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్‌గా ప్రచారం చేసి లబ్ది పొందాలనుకున్నారు. కానీ మొదటికే మోసం వచ్చింది.