సామాన్యులు రోజు గడవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం దివాలా కంపెనీల నుంచి వేల కోట్లు సృష్టిస్తున్నారు. ఇలాంటి వారు మన కళ్ల ముందు కొంత మంది ఉన్నారు. వారిలో మరొకరు చేరారు. ఆయనే బాబా రాందేవ్. పతంజలి సంస్థ అంటే గుర్తొచ్చేది బాబా రాందేవ్. ఆయన సంస్థ ఇటీవల వేల కోట్ల నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఓ దివాలా కంపెనీని కొని .. వేల కోట్లను ఇట్టే ఒడిసి పట్టేస్తోంది. ఈ క్రమం చూస్తే…ఇలా కూడా చేయవచ్చా అని సామాన్యులు నోరెళ్లబెట్టడం ఖాయం.
దివాలా తీసిన రుచి సోయాను కొన్న పతంజలి…!
రుచి సోయా కంపెనీ బ్యాంక్‌ల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించలేక 2017లో దివాలాకు వెళ్లింది. చాలా బ్యాంకులు రుణాలు రైటాఫ్ చేశాయి. చివరికి కంపెనీ లా ట్రిబ్యునల్ రుచి సోయాను వేలం వేసింది. 2018 డిసెంబర్లో నిర్వహించిన బిడ్డింగ్‌లో రుచి సోయాను పతంజలి రూ. 4350 కోట్లకు దక్కించుకుంది. ఇందులోనూ రూ.3,250 కోట్లు బ్యాంక్‌ల నుంచి రుణ గ్యారంటీనే. ఈ కంపెనీని దక్కించుకోవడానికి అదానీ కూడా పోటీ పడ్డారు. కానీ మధ్యలో డ్రాప్ అయిపోయారు. పోటీ లేకపోవడంతో పతంజలి పరం అయింది రుచి సోయా. అయితే దివాలా కంపెనీని బాబా రాందేవ్ ఏం చేసుకుంంటారా అన్న అనుమానాలు చాలా మందికి వచ్చాయి. ఆయనకంపెనీనే పతంజలినే వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోతోంది కదా అన్న డౌటనుమానం కూడా వచ్చింది. కానీ ఏం చేయవచ్చో బాబా రాందేవ్ ఇప్పుడు చూపించారు.
రూ. మూడు నుంచి వెయ్యికి పెరిగిన షేర్ ధర !
పతంజలికి రుచి సోయాలో 98.9 శాతం వాటాలు ఉన్నాయి. ఒక్క శాతం మాత్రమే షేర్ మార్కెట్లో లిస్టవుతోంది. అంటే అమ్మేవారు లేనందున ఈ షేర్‌ను పకడ్బందీగా పెంచుకుంటూ పోయారు. రెండేళ్లలో ఆ కంపెనీ షేర్ రూ.3.50 నుంచి రూ.1053కి చేరింది. అంటే దివాలా తీసిన విలువ కూడా రూ.31 వేల కోట్ల పైకి చేరిందన్నమాట. ఇలా కూడా జరుగుతుందా అని మనం ఆశ్చర్యపోవడమే. కానీ బాబా చేసి చూపించారు.
ఇప్పుడు 20 శాతం షేర్లను రూ. 4300 కోట్లకు అమ్మకం !
రుచి సోయాకు నిధుల సేకరణ కోసం ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఎఫ్‌పిఒకు వచ్చారు. ఇందులో 20 శాతం వాటాలను విక్రయించడం ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించాలని రామ్‌దేవ్ బాబా లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ కంపెనీలోని 100 శాతం వాటాలను రూ.4350 కోట్లకు కొనుగోలు చేసిన పతంజలి… రెండేళ్లలోనే 20 శాతం వాటాల అమ్కంతో ఆ మొత్తాన్ని సంపాదించడమే కాదు.. కంపెనీ విలువను కూడా ఆమాంతం పెంచేసుకుంది. ఈ మధ్యలో ఉత్పత్తి.. ఆదాయం.. ఏమైనా పెరిగిందా అంటే ఏమీ లేదని చెప్పుకోవాలి.
రుణాలు రద్దు చేసిన బ్యాంకులే వాటాల కొనుగులు చేస్తున్నాయి !
రుచి సోయాకు ఇచ్చిన వేల కోట్లు రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. అవే బ్యాంక్‌లు ఇప్పుడు క్యూఐపి పద్దతిలో ఈ సంస్థలోని వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపు తున్నాయి. ఎలా చూసినా ఎఫ్పిఒతో బాబా రామ్‌దేవ్ మాత్రం ఎలాంటి పెట్టుబడి లేకుండా 80 శాతం వాటాతో రూ.31 వేల కోట్ల సంపదను పొందనున్నారు. ఇలాంటి బుర్రలు ఉంటే చాలు కదా.. కుబేరులు పెరిగిపోవడానికి.. !