తనను స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగించాలనే తీర్పును ఏపీ సర్కార్ అమలు చేయడం లేదంటూ.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ.. తాను విధుల్లో చేరే విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. చీఫ్ సెక్రటరీని, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శిని, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కొద్ది రోజుల కిందట.. ఎస్ఈసీగా ఉన్న రమేష్‌కుమార్‌ను తొలగించేలా ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. ఆ అర్డినెన్స్ను హైకోర్టు కొట్టి వేసింది. రమేష్‌కుమార్‌ను పునర్నియమించాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజునే నిమ్మగడ్డ చార్జ్ తీసుకున్నారు. ఆ మేరకు ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సర్క్యూలర్ కూడా రిలీజయింది. అయితే.. తర్వాతి రోజు.. హైకోర్టు తీర్పునకు కొత్త అర్థం చెబుతూ.. అడ్వకేట్ జనరల్ ప్రెస్‌మీట్ పెట్టారు. హైకోర్టు తీర్పు ప్రకారం.. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదని..అందుకే.. సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని .. ఇదే అభిప్రాయాన్ని న్యాయసలహాగా ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నామన్నారు. దాంతో.. ఏపీ సర్కార్ నిమ్మగడ్డ చార్జ్ తీసుకోవడాన్ని ఉపసంహరిస్తూ.. మరో ఉత్తర్వ జారీ చేయించింది. ఈ కారణంగా హైకోర్టు తీర్పు ఇచ్చినా నిమ్మగడ్డ విధుల్లో చేరలేకపోయారు. ఏపీ ప్రభుత్వం ఓ సారి… ఎన్నికల సంఘం కార్యదర్శి ఓ సారి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి.. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే కోరారు. కానీ సుప్రీంకోర్టు ఇవ్వలేదు.
హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయకపోవడం.. కోర్టు ధిక్కరణే అన్న చర్చ న్యాయవర్గాల్లో జరుగుతోంది. సుప్రీంకోర్టులో వచ్చే నిర్ణయాలను బట్టి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలన్న ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఇన్ని రోజులూ… తన పిటిషన్ వేయకుండా ఎదురు చూశారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడంతో.. హైకోర్టు తీర్పును అమలు చేస్తుందేమో అనుకున్నారు. కానీ రెండు సార్లు సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా… ఏపీ సర్కార్ హైకోర్టు తీర్పును అమలు చేసే ఉద్దేశంలో లేకపోవడంతో.. చివరి ప్రయత్నంగా.. కోర్టు దిక్కరణ పిటిషన్ వేశారు.