దర్శకుడు రమేష్ వర్మ ఇప్పుడు నిర్మాతగానూ బిజీ అవుతున్నారు. ఆయన ఆర్వీ ఫిల్మ్ హౌస్ అనే బ్యానర్‌ని స్థాపించారు. ఈ సంస్థ నుంచి తొలి చిత్రాన్ని అధికారికంగానూ ప్రకటించారు. ఈ చిత్రానికి `కొక్కొరొకో` అనే టైటిల్ ఖరారు చేశారు. నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తారు. ఈ చిత్రంతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంకీర్తన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఓ కోడి చుట్టూ తిరిగే కథ ఇది. ఆ కోడి ఎంతమంది జీవితాల్ని ప్రభావితం చేసింది? అనేదే కథ. ఈ సినిమా కోసం కొత్త నటీనటుల్ని ఎంచుకొనే పనిలో పడింది చిత్రబృందం. ‘కొక్కొరొకో’ ఒకటే కాదు. ఇదే బ్యానర్‌పై వరుసగా సినిమాలు చేయాలని రమేష్ వర్మ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మరో కొత్త సినిమా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు రమేష్ వర్మ దర్శకుడిగానూ పలు చిత్రాలు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయి. లారెన్స్ తో ‘కాలభైరవ’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఇదో సోషియో ఫాంటసీ థ్రిల్లర్. ‘కిల్’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాలో కనిపించే హీరో ఎవరన్నది తెలియాల్సివుంది. ‘రాక్షసుడు 2’ స్క్రిప్టు కూడా రెడీ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ యేడాది దర్శకుడిగా ఓ చిత్రాన్ని, నిర్మాతగా ఓ సినిమానీ విడుదల చేయాలన్నది రమేష్ వర్మ ప్లాన్.