రైడ్, రాక్షసుడు చిత్రాలతో ఆకట్టుకొన్న దర్శకుడు రమేష్ వర్మ. ఖిలాడీ ఆయన్ని బాగా నిరాశ పరిచింది. అయితే… ఆ పరాజయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల్లో మునిగిపోయారు. లారెన్స్ కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నారాయన. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈలోగా.. ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం వచ్చింది. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన భూల్ భులాయా 2 రీమేక్ బాధ్యతలు తీసుకొన్నారాయన. ఆయనతో ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకొంటోంది. ప్రస్తుతం హీరో కోసం అన్వేషణ సాగుతోంది. వరుణ్ తేజ్, నాగచైతన్య, కల్యాణ్ రామ్.. ఇలా కొంతమంది హీరోల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన భూల్ భులాయా 2 బాలీవుడ్ లో కాసుల వర్షం కురిపించింది. హారర్ జోనర్‌కి ఎక్కడైనా మంచి గిరాకీ ఉంది. రాక్షసుడుతో రీమేక్‌లు బాగా తీయగలడని రమేష్ వర్మ నిరూపించుకొన్నాడు. అందుకే ఇప్పుడు ఈ హిందీ రీమేక్ ఆయన చేతిలో పడింది. ప్రస్తుతం ఈ స్క్రిప్టులో మార్పులూ చేర్పులూ జరుగుతున్నాయి. త్వరలోనే హీరో ఎవరన్నది తెలుస్తుంది.