దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తను తీసే సినిమాల ద్వారా కాకుండా, తను చేసే ట్వీట్ మెసేజుల ద్వారా లేదా వివిద అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు తీస్తున్న సినిమాలలో కూడా సెక్స్ కంటెంట్ ని కాస్త ఎక్కువే జోడిస్తూ ప్రజల బలహీనతలని సొమ్ము చేసుకొంటున్నారు తప్ప అందరినీ ఆకట్టుకోగల గొప్ప చిత్రాలేవీ తీయలేకపోతున్నారు. బహుశః ఆ కారణంగానే ఆయన ఈ మార్గాన్ని ఎంచుకొని నిత్యం మీడియాలో ఉండేందుకు జాగ్రత్తపడుతున్నట్లున్నారు.
ఊహించినట్లుగానే కేంద్రప్రభుత్వం అశ్లీల వెబ్ సైట్ల నిషేధం విదించడంపై కూడా ఆయన వ్యతిరేకిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకు అశ్లీలం అంటే ఏమిటో తెలియనప్పుడు వారిలో అటువంటి దృశ్యాలను చూసినా ఎటువంటి స్పందన ఉండదని ఆయన వాదన. కానీ ఊహతెలియని బాల్య వయసులో చూసినవి, విన్నవీ, ఎదురయిన అనుభవాలు కూడా మనిషి జీవితంలో చివరి వరకు ప్రభావం చూపుతుంటాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. వాటి ఆధారంగానే అనేక సినిమాలు కూడా తీస్తున్నారు కూడా.
అశ్లీల వెబ్ సైట్ల నిషేధం అంటే ప్రజల స్వేచ్చని హరించడమేనని వర్మ అభిప్రాయం. సుప్రీంకోర్టు కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసింది. ఆ ప్రకారం చూస్తే ఆత్మహత్యని నేరంగా పరిగణించడం కూడా వ్యక్తి స్వేచ్చను హరించడమే? అలాగని ఆత్మహత్యలు చేసుకోమని ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు కదా? షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ని చూసి ప్రజలందరూ దోపిడీ దొంగలుగా, ‘హం ఆప్ కి హై కౌన్’ సినిమా చూసి ప్రజలు మళ్ళీ ఉమ్మడి కుటుంబాలను ఏర్పాటు చేసుకోనట్లే అశ్లీల చిత్రాలలో చూపించే విశృంకలమయిన సెక్స్ క్రీడలను చూసి ప్రజలు చెడిపోరని వాటిని కేవలం కామోద్దీపనకు మాత్రమే చూస్తారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేసారు. అసలు నేటికీ భారతీయ కుటుంబాలలో సెక్స్ గురించి తమ పిల్లలతో మాట్లాడేందుకు పెద్దవాళ్ళు ఎందుకు సంకోచిస్తారో అని సందేహం వ్యక్తం చేసారు. పెద్దవాళ్ళు దాని గురించి చెప్పినా చెప్పకపోయినా పిల్లలు అన్ని విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోగాలుగుతున్నారని ఆయనే చెప్పారు.
వర్మ చెప్పినట్లుగా సినిమాలను చూసి ప్రజలందరూ మారిపోకపోవచ్చును. కానీ వాటి ప్రభావం చాలా మంది ప్రజల మీద చాలా తీవ్రంగా ఉంటుందనే విషయం ఆయనకీ తెలిసే ఉంటుంది. అటువంటప్పుడు అశ్లీల చిత్రాల వలన పిల్లలు, యువతపై ఎటువంటి విపరీత ప్రభావం ఉండదని ఆయన వాదించడం అవివేకమే. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువతని ఇప్పుడు సినిమాలు, ఫేస్ బుక్, ట్వీటర్ వంటి సామాజిక మాధ్యమాలు, నడిపిస్తున్నాయి. వాటి వలన కుటుంబ సభ్యుల మధ్య బంధాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి.
ఈ సమస్యలు సరిపోవన్నట్లు ప్రభుత్వాలే ఉచిత వైఫీ ద్వారా సెల్ ఫోన్లకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తూ వారి బలహీనతలను మరింత ప్రోత్సహిస్తున్నాయి. యువత చేతిలో సెల్ ఫోన్లు దానిలో ఉచిత వైఫీ వలన ఇంతవరకు వారికి అందుబాటులో లేని అశ్లీల,బూతు చిత్రాలను కూడా చూసే అవకాశం ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. చివరికి దీని వలన కలుగుతున్న సామాజిక అనర్ధాలను గుర్తించి కేంద్రప్రభుత్వం అశ్లీల చిత్రాల ప్రసారాలను నిలిపివేస్తే వర్మ వంటి కుహాన మేధావులు తమ మేధాశక్తిని ఆ నిర్ణయం తప్పని నిరూపించేందుకు ఉపయోగించడం చాలా శోచనీయం. ఇప్పుడు భారతీయ యువతకి వర్మ వంటి వారి సలహాలు కాదు కావలసింది. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం వంటి మహనీయులు చూపిన మార్గమే చాలా అవసరం.