ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలయిన ‘బ్రూస్ లీ’ సినిమాను పట్టుకొని పీకి పాకం పట్టేసి, రామ్ చరణ్ తేజ్ కి అతనితో బాటు ‘డాడీ’ చిరంజీవికి చురకలు వేసిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఇవ్వాళ్ళ ‘డాడీ’ మీద తన ట్వీటర్ బాణాలు సందించారు. బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి తెలుగు ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటుతుంటే, చిరంజీవి అది పట్టించుకోకుండా తన 151వ సినిమా కోసం ఒక తమిళ సినిమాని కాపీ (తెలుగులో రీమేక్) చేయాలనుకోవడం తెలుగువారిని కించపరచడమేనని అన్నారు. కనుక ఆయన తెలుగు కధతోనే తన 151వ సినిమా తీయాలని మెగా అభిమానులు అందరూ ఆయనపై ఒత్తిడి చేయాలని కోరారు. తెలుగు సినీ పరిశ్రమకి ఇప్పుడు నిజమయిన బ్రూస్ లీ రాజమౌళియేనని ప్రశంసించారు.
రామ్ గోపాల్ వర్మ ఉద్దేశ్యం చిరంజీవి తన 151వ సినిమాని వి.వి.వినాయక్ తో కాకుండా రాజమౌళితోనే తీయాలని సూచిస్తున్నట్లుంది. ఇంతకు ముందు చిరంజీవి పూరీ జగన్నాథ్ తో సినిమా తీయడానికి సిద్దమవుతున్నప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలే చేసారు. మళ్ళీ ఇప్పుడు వి.వి.వినాయక్ ని కూడా చులకన చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒక దర్శకుడు సాటి దర్శకుడి గురించి ఎటువంటి అభిప్రాయాలయినా కలిగి ఉండవచ్చును. కానీ ఒకరు ఎక్కువ గనుక మిగిలినవారందరూ వేస్ట్ అన్నట్లుగా మాట్లాడటం, ఒక దర్శకుడు సినిమా నిర్మాణానికి సిద్దం అవుతున్నప్పుడు అతని ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కామెంట్స్ చేయడం కేవలం రామ్ గోపాల్ వర్మ వంటి కుహాన మేధావులు మాత్రమే చేయగలరు.