దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతోప్రజలని ఆకట్టుకోలేకపోయినా తన వివాదాస్పద ట్వీటర్ మెసేజ్ లతో ప్రజల నోళ్ళలో బాగానే నానుతున్నారు. కానీ దాని వలన ఆయన సినిమాలు మాత్రం విజయవంతం కావడం లేదని తరచూ ఫ్లాప్ అవుతున్న ఆయన సినిమాలను చూస్తే అర్ధమవుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన లక్ష్మీ పార్వతితో ఆయనని పోల్చవచ్చును. ఆమె తన భర్త ఎన్టీఆర్ పోయి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటికీ తన ఉనికిని కాపాడుకొంటున్నారు. ఏవిధంగా అంటే తరచూ చంద్రబాబు నాయుడుని, నందమూరి కుటుంబ సభ్యులనీ విమర్శిస్తూ! అదే విధంగా రామ్ గోపాల్ వర్మ కూడా రాజకీయ ప్రముఖులను విమర్శిస్తూనో లేదా ప్రజలు, రాజకీయ పార్టీలు ఆసక్తి చూపుతున్న ఏదో ఒక అంశం గురించో ట్వీటర్ లో వివాదాస్పదమయిన మెసేజులు పెడుతూ ప్రజల దృష్టిని ఆకట్టుకొనేందుకు తిప్పలు పడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం బాహుబలి-చిరంజీవి చేయబోయే 150వ సినిమా గురించి, తరువాత పుష్కరాలలో మృతుల గురించి, ఇప్పుడు పుష్కరాల పేరిట నదులను కలుషితం చేయడం గురించి ఆయన తన అభిప్రాయాలను ప్రజలకు ఉచితంగా తెలియజేస్తున్నారు. “అభివృద్ధి చెందిన దేశాలు తమ నదులను పరిశుభ్రంగాగా ఉంచుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం పుష్కరాల పేరిట నదులను మరింత మురికి చేసుకొంటున్నాము,” అని ట్వీటర్లో ఒక మెసేజ్ పెట్టారు.
నిజమే! అభివృద్ధి చెందిన దేశాలు తమ నదులను చాలా జాగ్రత్తగా కాపాడుకొంటున్నాయి. కానీ అవి తాము సుఖంగా, విలాసంగా జీవించేందుకు సృష్టిస్తున్నవాతావరణ కాలుష్యానికి యావత్ ప్రపంచాన్ని మూల్యం చెల్లించేలా చేస్తున్నాయి. తనను తాను మేధావిగా భావించే రామ్ గోపాల్ వర్మ అభివృద్ధి చెందిన దేశాలు సృష్టిస్తున్న వాతావరణ కాలుష్యం గురించి కూడా శలవిచ్చి ఉండి ఉంటే బాగుండేది.
ఆయన గుర్తించలేని అంశం ఏమిటంటే లక్షలాది ప్రజల మనోభావాలు. ఈ సామూహిక పుష్కర స్నానాల వలన కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చును. లేదా నదీ జలాలు కలుషితం కావచ్చును. కానీ అవన్నీ తాత్కాలికమే. కానీ పిల్లల నుండి వృద్దుల వరకు లక్షలాది మంది ప్రజలలో ఒక నూతనోత్సాహం నింపి మనమందరం ఒకే జాతి…ఒకే సంస్కృతి అనే ఒక గొప్ప భావం కలగడానికి దోహదపడుతున్న ఈ పుష్కరాలను రామ్ గోపాల్ వర్మ వంటి కుహనా మేధావులకి అందులో కాలుష్యం మాత్రమే కనబడటం విచిత్రం. నిజానికి ఆయన కంటే చాలా గొప్ప మేధావులు, విద్యావంతులు ఈ పవిత్ర పుష్కరాల కోసం దేశవిదేశాల నుండి తరలివస్తున్నారు. బహుశః ఆయన దృష్టిలో వారందరూ కూడా మూర్ఖులేనేమో?