థింక్ బిగ్ అనేది రామోజీ రావు నినాదం. ఆయన ఏం ఆలోచించినా ఊహకు మించి ఉంటుంది. రామోజీ ఫిల్మ్‌సిటీ అందుకు అతిపెద్ద నిదర్శనం. హైదరాబాద్ లో అప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియో, సారధి… ఇలా చిత్ర నిర్మాణానికి కావల్సినంత సరంజామా ఉంది. మరో స్టూడియో కడితే అది ఎలా ఉండాలి..? ‘ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయి తీరాలి’ అని రామోజీ రావు ఫిక్సయ్యారు. ఆయన ఆలోచనల్లోంచే ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ పుట్టింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియోగా రికార్డులకెక్కింది.
1996లో ఫిల్మ్‌సిటీ స్థాపించారు. అయితే అందుకు పదేళ్లకు ముందే ఫిల్మ్‌సిటీ ఆలోచనకు అంకురార్పణ జరిగింది. అందుకోసం ఏకంగా హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ లో దాదాపు 2 వేల ఎకరాలు సేకరించారు. అందులో 1600 ఎకరాల్లో ఫిల్మ్‌సిటీ నిర్మాణం జరిగింది. అప్పటికి అదంతా అటవీ ప్రదేశం. అన్నీ కొండలు, గుట్టలే. వాటిలో ఒక్క కొండను కూడా తవ్వకుండా, ఒక్క చెట్టు కూడా నరక్కుండా పక్కా ప్లాన్ ప్రకారం ఈ స్టూడియోని నిర్మించారు. నిర్మాత సూట్ కేస్ తో అడుగు పెడితే, ఫస్ట్ కాపీతో బయటకు వచ్చేన్ని సౌకర్యాలు ఈ ఫిల్మ్‌సిటీలో ఉన్నారు. చిత్రబృందం విడిది చేయడానికి స్టార్ హోటళ్లను కూడా స్టూడియో లోపలే నిర్మించారంటే ఆ ప్లానింగ్ అర్థం చేసుకోవొచ్చు. ప్రతీ యేడాది అన్ని భాషల్లోనూ కలిపి దాదాపు 500 చిత్రాలు ఇక్కడ తెరకెక్కుతాయి. సంవత్సరానికి దాదాపుగా 10 లక్షలమంది పర్యాటకులు ఈ స్టూడియోని సందర్శిస్తారని రికార్డులు చెబుతున్నాయి.
ఫిల్మ్‌సిటీ తరవాత… ‘ఓం’ పేరుతో ఓ ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించాలని రామోజీ కలలు కన్నారు. అందుకు తగిన ప్లానింగ్ కూడా జరిగింది. అయితే రామోజీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ ప్రయత్నం మధ్యలోనే ఆపేశారు.