ఫిలిం సిటీ తర్వాత ఓం సిటీ పేరిట రామోజీ రావు తలపెట్టిన భక్తి నగరం కోసం కెసిఆర్ ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇందుకోసం రామోజీ స్వయంగా విజ్ఞప్తులు చేశారు. ఒకటికి రెండు సార్లు కలిశారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీకి కూడా ఆల్బం ఇచ్చి వచ్చారు. అంతాబాగానే వుంది గాని ప్రభుత్వం ఇచ్చిన భూమి వారి అంచనాలకు తగినట్టు కోరుకున్న చోట దక్కలేదట. దాంతో పెద్దాయనకు కొంత నిరుత్సాహం కలిగింది. పైగా రామోజీ కుటుంబ సభ్యులకు మరో పెద్ద ప్రాజెక్టు నెత్తిన వేసుకోవడం ఇష్టం లేదని తెలిసింది. ఆయన ఆరోగ్యం కూడా గతంలోవలె లేదు. వీటన్నిటి వల్లా ఓం సిటీ నిర్మాణం విరమించినా ఆశ్చర్యం లేదని ఆంతరంగిక విషయాలు తెలిసినవారు చెబుతున్న మాట.
అయితే మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఈటీవీ భక్తి చానళ్ల సామ్రాజ్యం నెలకొల్పాలని రామోజీ ముచ్చట పడుతుండడం. చాలా ఏళ్ల కిందటే ఇలాటి పేర్లతో రిజిస్టర్ చేసిపెట్టారట. ఇప్పుడు వాటన్టినికి మూడు మాసాల్లోగా తీసుకురావాలని కోరుకుంటున్నారు. అయితే వీటి విషయంలోనూ ఆయనకున్నంత ఆసక్తి ఇతరులకు లేదని సమాచారం. మరి చివరకు ఈ రెండు ప్రణాళికలు ఎలాటి రూపం తీసుకునేది చూడాల్సిందే.