అమ్మ బువ్వ కలిపి ముద్దలు చేసి మనకు తినిపిస్తుంది… అందుకు అమ్మకు ఓ ముద్దు పెడతాం! పక్కనే ఖాళీగా ఉన్నది కదాని పిన్నికి కూడా ఓ ముద్దు పెట్టేస్తామా? ఈ లౌక్యం అందరికీ చేతకాకపోవచ్చు. కానీ రామోజీరావు తీరు వేరు. ఆయనైతే ‘ఓ ముద్దు పెడితే ఏం పోయిదిలెద్దూ… రేప్పొద్దున్న పిన్నితో ఏదైనా పని పడితే పనికొస్తుంది’ అనుకుంటూ.. ఆమెకు కూడా ఓ ముందస్తు ముద్దు పెట్టేసి ఇంప్రెస్ చేసే టైపు. అవును మరి.. ప్రస్తుతం… మన దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ కు రామోజీరావు ఎంపికైన నేపథ్యంలో.. ఆయన కృతజ్ఞతలు తెలియజేసిన తీరు గమనిస్తే.. ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
దేశంలో భారతరత్న తర్వాత అంత విశిష్టమైన పురస్కారం అయిన పద్మవిభూషణ్‌కు రామోజీరావు పేరును చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. సాధారణంగా ఎవరిపేరునైనా తొలుత పద్మశ్రీ కి ప్రతిపాదిస్తారు. పద్మశ్రీ వచ్చిన వారి పేరును ఆ తర్వాత కొంత కాలానికి పద్మభూషణ్‌కు, అది కూడా వస్తే.. ఆ తర్వాత కొంతకాలానికి విభూషణ్‌కు ప్రతిపాదిస్తారు. అయితే రామోజీ విషయంలో రెండు స్టెప్లు జంప్ చేసి మరీ ఒకేసారి ‘విభూషణ్’ ఇప్పించడానికి చంద్రబాబు చక్రం తిప్పారు. ఆయన ప్రతిపాదనకు బలం చేకూర్చుకోడానికి అన్నట్లుగా రామోజీరావు తాను స్వయంగా వెళ్లి మోడీని కలిసి స్వచ్ఛభారత్‌కు తన సంస్థ ఉద్యోగులందరితోనూ ఎంతగా సేవ చేయిస్తున్నానో.. ఫోటో బుక్ ప్రెజంటేషన్ రూపంలో తెలియజేసుకున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ అవార్డుకు ఆయనను ఎంపిక చేసింది.
ఈ పురస్కారం రావడంలో చంద్రబాబు, మోడీ పాత్ర మాత్రమే ఉండగా.. వారితో సమానంగా కేసీఆర్ కు కూడా రామోజీ రావు కృతజ్ఞతలు తెలియజేయడం ఆయన వినమ్రతకు పరాకాష్ట అనుకోవాలి. పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ… ‘నన్ను సత్కరించాలని నిర్ణయించిన కేంద్ర, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు. నిర్ణేతలకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యలో కేసీఆర్ సర్కారుకు కూడా ఈ థాంక్స్ ఎందుకంటే.. ఇప్పుడు రామోజీరావు కొత్తగా సంకల్పిస్తున్న ఓం సిటీ వ్యాపారం మొత్తం తెలంగాణ ప్రభుత్వం దయా దాక్షిణ్యాలమీదే ముందుకు సాగే అవకాశం ఉంది. కేసీఆర్ ఏమాత్రం బ్రేకు తొక్కినా.. ఆ వ్యాపారం మొత్తం పడుకుంటుంది. అందుకే తన దృష్టిలో కేసీఆర్‌కు చంద్రబాబుతో సమానంగా విలువ ఉన్నదనే బిల్డప్ కోసం ఈ థాంక్స్ చెప్పేశారని.. అంతా అనుకుంటున్నారు. వినమ్రతకు పరాకాష్ట కాకపోతే.. బహుశా రామోజీ వైఖరి లౌక్యానికి పరాకాష్ట అనుకోవాలి.