ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో అగ్రగామిగా నిలవడం, తనదైన బ్రాండ్ స్థాపించడం రామోజీరావుకు వెన్నతో పెట్టిన విద్య. పేపర్ దగ్గర్నుంచి పచ్చళ్ల వ్యాపారం వరకూ, మసాలా పొడుల నుంచి సినిమా ఇండస్ట్రీ వరకూ, ఛానళ్లూ, హోటెళ్లూ… ఇలా ఏ రంగంలో అయినా నెంబర్ వన్ ఆయన. ఏదైనా చేయాలనుకొంటే – ఇక వెనుకడుగు వేసేదే ఉండదు. అలాంటి రామోజీరావుకు కూడా తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. అదే.. ‘ఓం సిటీ’.
వినోదం అనగానే రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఎలా చెప్పుకొంటున్నారో, అలానే ఆధ్యాత్మికం అనగానే ‘ఓం సిటీ’ గుర్తుకురావాలన్న ఆలోచన నుంచి `ఓం సిటీ` పుట్టింది. దాదాపు 200 ఎకరాల్లో ఓ ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించాలనుకొన్నారు రామోజీ. దేశంలోనే ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాల రెప్లికాలన్నీ వరుసగా ఓ చోట ప్రతిష్టించాలని భావించారు. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరిగింది. ఆహ్వాన పత్రికలు కూడా అచ్చు వేశారు. గెస్టులుగా ఎవరెవరన్ని పిలవాలో లిస్టు కూడా వేశారు. ఫిలిం సిటీ తరవాత రామోజీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, మనసు పెట్టి వర్క్ చేసింది ‘ఓం సిటీ’కే. కానీ.. ఆ ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. తనయుడు సుమన్ మరణం, తన ఆరోగ్యం సహకరించకపోవడం.. తదితర కారణాల వల్ల అన్యమనస్కంగానే ఈ ప్రాజెక్టుకు పుల్ స్టాప్ పెట్టాల్సివచ్చింది. ‘ఈనాడు’లానే న్యూస్ టుడే పేరుతో ఓ ఇంగ్లీష్ పేపర్ని తీసుకొచ్చారు. అయితే అప్పట్లో డెక్కన్ క్రానికల్, హిందూ పత్రికలతో పోటీ పడలేక ఆ పత్రికనూ ఆపేశారు. రామోజీరావు ఫెయిల్యూర్ అయిన సందర్భం అదొక్కటే.