ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నుంచి ఎన్నో మరపురాని సినిమాలొచ్చాయి. హృద్యమైన కథలకు ఆ సంస్థ పెట్టింది పేరు. యువ దర్శకులకూ అవకాశాలిచ్చి, వారి ప్రతిభను బయటకు తీసుకొచ్చింది. అయితే కొన్నాళ్లుగా ఉషాకిరణ్ నుంచి సినిమాలు రావడం లేదు. మిగిలిన వ్యాపారాల్లో కనిపించే `లాభం` సినిమాల్లో లేకపోయేసరికి మెల్లమెల్లగా సినీ నిర్మాణం తగ్గించుకుంది. అయితే ఇప్పుడు మళ్లీ… ఉషాకిరణ్ మూవీస్ యాక్టీవ్ అవుతున్నట్టు టాక్. ఉషాకిరణ్ మూవీస్ సంస్థ కొన్ని కథలు సిద్ధం చేసిందని టాక్. ఉషాకిరణ్ ఇప్పటి వరకూ దాదాపు 85 సినిమాల్ని రూపొందించింది. మరో 15 తీస్తే వంద సినిమాలు తెరకెక్కించిన ఘనత దక్కుతుంది. అందుకే… ఆ మైలు రాయి కోసమైనా సినిమాలు చేయాలని రామోజీరావు భావిస్తున్నారట. అలాగని ఏ కథలు పడితే, ఆ కథల్ని ఎంచుకోకుండా, ఉషాకిరణ్ గత వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా సినిమాల్ని రూపొందించాలని భావిస్తున్నారట.
ఉషాకిరణ్ దగ్గర కొన్ని కథలు సిద్ధమయ్యాయి కూడా. ఆ కథల్ని యువతరం దర్శకులతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. తొలి సినిమాతోనే హిట్టు కొట్టిన కొంతమంది దర్శకులకు ఉషాకిరణ్ మూవీస్ నుంచి పిలుపొచ్చింది. కొంతమందికి అడ్వాన్సులూ అందాయి. ఈ సినిమాలకు రామోజీ రావు నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందని సమాచారం. ఉషాకిరణ్ మూవీస్‌కి ఓ స్టోరీ బోర్డ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అది కొంతకాలంగా కొత్తకథల్ని వినడం లేదు. ఇప్పుడు మళ్లీ కొత్త కథలు వినడం మొదలెట్టింది. 2020 నుంచి ఉషాకిరణ్ నుంచి యేడాదికి కనీసం 3 సినిమాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఉషాకిరణ్‌కి కావల్సినంత ఇన్ఫ్రాస్టక్చర్ ఉంది. స్డూడియోలు, ల్యాబ్‌లు ఉన్నాయి. మంచి కథలు దొరికితే చాలు. ప్రస్తుతం ఉషాకిరణ్ ఫోకస్ అంతా వాటిపైనే.