త్రిదండి చిన జీయర్ స్వామి, ప్రముఖ వ్యాపార వేత్త రామేశ్వరరావుల బృందం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్న ఘట్టం వర్తమాన రాజకీయాలకు ఒక చిరు దర్పణం. రాజధానిలో తెలంగాణ ముఖమంత్రి కెసిఆర్ మకాం చేసి వున్నప్పుడే ఇది జరగడం కూడా యాదృచ్చికం కాదు. రామేశ్వరరావు స్వంత వేడుకల్లోనే కెసిఆర్ జియ్యర్ ఇద్దరూ ఎంత ప్రాధాన్యత నిచ్చి పాల్గొన్నారే అందరూ చూశారు. అసలు ఆ ఇంట కార్యక్రమం లేదా ఆ సంస్థ వాణిజ్య ఉత్సవం అనగానే అంతటి స్వాముల వారు రెక్కలు కట్టుకుని వాలడం, అనితర సాధ్యుడైన కెసిఆర్ కూడా కావలసినంత సమయం కేటాయించడం చాలాసార్లు జరిగింది. శంషాబాద్‌లో భారీ రామానుజ విగ్రహ స్థాపన గురించి జియ్యర్ స్వామి చేస్తున్న ప్రయత్నం ఈనాడులో చాలా భారీ కథనంగా ఆయన ఇంటర్వ్యూతో సహా వచ్చింది. అసలు రామోజీరావే ఫిలింసిటీలో ఓం సిటీ కట్టి ఆధ్మాత్మిక ముద్ర వేసుకోవడం కూడా కెసిఆర్ సమక్షంలోనే ఒకటికి రెండు సార్లు జరిగింది. కెసిఆర్ చేసిన చండీయాగానికి కూడా రామోజీ చాలా ప్రత్యేక శ్రద్ధతో హాజరైనారు. ఎన్నడూ లేనిది సచివాలయానికి స్వయంగా వెళ్లి కెసిఆర్‌కు తన ఓం సిటీ ఆల్బం ఇచ్చి వచ్చారు. అంతకు ముందు ముఖ్యమంత్రి స్వయంగా ఒక రోజు గడిపి పొగిడి వచ్చారు. తనలో క్రమేణా ఆధ్యాత్మిక భావనలు పెరిగినట్టు రామోజీ సన్నిహితులతో చెబుతున్నారట. ఈ పరిణామాలూ దానికి అనుగుణంగానే వున్నాయి. అదంతా ఒకటైతే హైదరాబాద్ కేంద్రంగా ఆధ్యాత్మిక రాజకీయ వ్యాపార బంధాల కలయిక పెంపొందడం అది ఢిల్లీదాకా విస్తరించి మోడీని తాకడం ఆసక్తికరం. రామ్‌దేవ్ బాబా ఉదంతం చూశాక ఇవన్నీ ఏమంత ఆశ్చర్యం అనిపిస్తాయి?