దేశంలో ఇంత పలుకుబడి ఉన్న వ్యక్తిని నేనెక్కడా చూడలేదు అని రామోజీరావుపై ప్రభుత్వాల మద్దతుతో పోరాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ తరచూ చెబుతూంటారు. రామోజీరావు చనిపోయాక కూడా అదే చెప్పారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. రామోజీరావు పవర్ ఎంటో ఆయనతో పెట్టుకున్న వాళ్లకి.. పెట్టుకోని వాళ్లకు తెలుసు. ఆయన రియల్ లైఫ్ పొలిటికల్ గాడ్ ఫాదర్.
ప్రధానమంత్రి దగ్గరకైనా ఆయన పోవడం అరుదు. వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడే వెళ్తారు. మిగిలిన సందర్భాల్లో ఆయన ఇంటికే ప్రధానులు వస్తారు. కేంద్ర హోంమంత్రులు వస్తారు. ఎప్పుడూ ఓ ఎంపీగా ఎప్పుడూ చేయలేదు.. .ఓ ఎమ్మెల్యే అసలే కాదు. ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాలు చేయలేదు. కానీ ఆయన ముద్ర మాత్రం రాజకీయాల్లో పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇది నాటి ఇందిరా గాంధీ నుంచి నేటి జగన్ వరకూ సాగింది. తాను నమ్మిన సిద్ధాంతానికి మాత్రమే రామోజీరావు బద్దుడు.
ఇందిరాగాంధీ హయాంలో ఎదురైన వేధింపుల దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎదురైనా ఇబ్బందులను కూడా ఆయన గట్టిగా ఎదుర్కొన్నారు కానీ.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన ఆస్తులపై దాడి చేశారు. మార్గదర్శిపై ఆరోపణలు చేశారు. కానీ ఏమీ చేయలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్గదర్శి విషయంలో వ్యవహారంచిన తీరు ఎలా ఉందో ప్రజలందరూ చూశారు. కానీ ఎక్కడా తగ్గలేదు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు.
ప్రభుత్వాలను కనుసైగలతో శాసించగలరు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను మార్చగలరు. అన్యాయాలపై ఆయన పోరాటం అనన్య సామాన్యం. రామోజీరావు ఎప్పుడూ ప్రజా జీవితంలోకి రాలేదు. ఎప్పుడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎప్పుడూ తాను పెట్టుకున్న విలువల్ని, పెట్టుకున్న గీతల్ని దాటాలని అనుకోలేదు. అదే ఆయనను పొలిటికల్ గాడ్ ఫాదర్ గా మార్చేసింది.