మీడియా మొఘల్ గా పిలుచుకొనే రామోజీరావులో భిన్న కోణాలు కనిపిస్తాయి. పత్రికా సంపాదకుడిగా, పబ్లిషర్‌గా, నిర్మాతగా, ఈటీవీ అధినేతగా, రామోజీ ఫిల్మ్‌సిటీ సారధిగా ఎన్నో రంగాల్లో తన ఆధిపత్యాన్ని చూపించారు. ఏ రంగంలో అడుగుపెట్టినా విజయ ఢంకా మోగించడం ఆయన ఆనవాయితీ. వ్యాపార పరంగా రాజీ పడని విధానం ఆయనది. ప్రతీరంగంలోనూ వ్యాపార కోణమే కాదు, రామోజీరావు అభిరుచి కూడా ప్రస్పుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సాహితీ రంగంలో.
సితార, విపుల, చతుర పేరుతో ‘ఈనాడు’కు అనుబంధంగా కొన్ని ఉప పత్రికలు వచ్చేవి. ముఖ్యంగా విపుల – చతురలో సాహిత్యానికి పెద్ద పీట వేసేవారు. చతుర నవలలు కొన్ని సినిమాలుగానూ వచ్చాయి. తక్కువ రేటుతో విలువైన పత్రికలు ఎలా నడుపుతున్నారో అనేంత ఆశ్చర్యం కలిగేది పాఠకులకు. మాతృభాష పునరుద్ధణోద్యమంలో భాగంగా ‘తెలుగు – వెలుగు’ పత్రికను ప్రారంభించారు. ఇది రామోజీ మానస పుత్రికగా చెప్పుకోవొచ్చు. ఈ వయసులో కూడా `తెలుగు – వెలుగు`ని దగ్గరుండి చూసుకొన్నారు. ‘బాల భారతం’ పేరుతో పిల్లల కోసం ఓ మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చారు. ప్రింటింగ్ క్వాలిటీ అదిరిపోయేది. రేటేమో తక్కువ. ”నాకు నష్టాలొచ్చినా ఫర్వాలేదు. సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువ చేయాలి” అని చెప్పేవారు రామోజీ. కాలక్రమంలో మేగజైన్లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. మొదట సితార, విపుల, చతుర మూతబడ్డాయి. కరోనా కలంలో ‘తెలుగు వెలుగు’, ‘బాల భారతం’ కూడా ఆగిపోయాయి. అయితే ఈ పత్రికల రూపేణా రామెజీ తెలుగు సాహితీ లోకానికి అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి.