రామోజీ రావు ఏ రంగంలో అడుగుపెట్టినా – అద్భుతమైన విజయాలే సాధించారు. సినిమా రంగంలోనూ రామోజీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఓ దిన పత్రికలో ‘సినిమా’కంటూ ఓ ప్రత్యేకమైన పేజీ తీసుకొని రావాలన్న ఆలోచనకు అంకురార్పణ చేసింది రామోజీ రావునే. ‘ఈనాడు’లో సినిమా పేజీ మొదలుపెట్టిన తరవాత అన్ని దినపత్రికలూ ఆయన్ని అనుసరించాయి. సినిమాపై మక్కువతో 1984లో ఉషాకిరణ్ మూవీస్ సంస్థకు అంకురార్పణ చేశారు రామోజీరావు.
‘శ్రీవారికి ప్రేమలేఖ’ ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం. కాంచనగంగ, ప్రేమించు – పెళ్లాడు, మౌన పోరాటం, పీపుల్ ఎన్కౌంటర్, మయూరి, ప్రతిఘటన, మనసు – మమత, అమ్మ, చిత్రం… ఇలా ఎన్నో విజవంతమైన చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. దాదాపు 90 సినిమాల్ని అందించారు రామోజీ రావు. కమర్షియల్ అంశాలకంటే కంటెంట్ కే పెద్ద పీట వేసి తీసిన సినిమాలివి. ‘ప్రతిఘటన’, ‘మౌన పోరాటం’, ‘మయూరి’లాంటి చిత్రాలు ఉషాకిరణ్ మూవీస్ ప్రతిష్టని పెంచాయి. ఈనాడు కాంపౌండ్లో కథలకు పెద్ద పీట వేసేవారు. ఓ కథ అక్కడ ఓకే అవ్వాలంటే చాలా ప్రోసెస్ జరిగేది. ఉషాకిరణ్ మూవీస్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్టు కూడా చాంతాడంత ఉంటుంది. ‘శివ’ లాంటి కథలు ముందు ఉషాకిరణ్ మూవీస్ దగ్గరకే వెళ్లాయి. చాలాకాలంగా ఉషాకిరణ్ మూవీస్ లైమ్ లైట్ లో లేదు. అయితే ఈమధ్య మళ్లీ ఉషాకిరణ్ మూవీస్ లో సినిమాల్ని ముమ్మరంగా తీయాలని భావించారు. ఆ ప్రయత్నాలూ మొదలయ్యాయి. కానీ ఇప్పుడు రామోజీరావు మరణంతో ఆ సంస్థ పునరాగమనానికి బ్రేకులు పడ్డాయి.