మీడియా మొఘల్ రామోజీరావుని మీడియాలో చూడడం చాలా అరుదు. ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వరు. బయట సభల్లోనూ, సమావేశాల్లోనూ కనిపించరు. కానీ విచిత్రం ఏమిటంటే… ఆయన ఓ సినిమాలో నటించారు. 1978లో వచ్చిన ‘మార్పు’ అనే చిత్రంలో న్యాయమూర్తి పాత్రలో కాసేపు మెరిశారు రామోజీ. అప్పట్లో సినిమాలంటే రామోజీకి మక్కువగా ఉండేది. నటుడిగా తాను ఎలా ఉంటానో చూసుకోవాలన్న ఉత్సాహంతో ‘మార్పు’ అనే సినిమాలో కనిపించారు. కానీ తరవాత అలాంటి ప్రయత్నం చేయలేదు. 1984లో ఉషాకిరణ్ మూవీస్ స్థాపించారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన దాదాపు 90 చిత్రాల్లో ఒక్కదాంట్లో కూడా రామోజీరావు కనిపించలేదు. కనీసం సినిమా ఫంక్షన్లకూ ఆయన దూరంగా ఉండేవారు. ఉషాకిరణ్ మూవీస్ తీసిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు. కేవలం సుమన్ బలవంతంపై ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్లలో కాస్త మెరిసేవారంతే!
రామోజీరావు వారసులు కిరణ్, సుమన్‌లలో, సుమన్‌కు నటన, దర్శకత్వం, రచన అంటే మక్కువ ఎక్కువగా ఉండేది. అప్పట్లో ఈటీవీలో వచ్చే సీరియల్స్ లో సగం సుమన్ పర్యవేక్షణలోనే జరిగేవి. నటిస్తూ, దర్శకత్వం వహించిన సీరియళ్లు చాలానే ఉండేవి. ఆ తరవాత కొన్ని సినిమాలూ చేశారు సుమన్. కిరణ్ మాత్రం ‘ఈనాడు’ కార్యకలాపాలతో బిజీ అయిపోయారు. సినీ నిర్మాణంలోనూ ఆయనకు పెద్దగా ప్రవేశం లేదు. ఉషాకిరణ్ మూవీస్ తెరకెక్కించిన అన్ని చిత్రాలకూ రామోజీనే నిర్మాత. ఇప్పుడు ఆ బాధ్యతల్ని కూడా కిరణ్ తీసుకొంటారేమో చూడాలి.