ట్రెండ్ బట్టి కొత్త వ్యాపారం మొదలెట్టడం రామోజీరావు స్టైల్. ఇప్పుడాయన దృష్టి ఓటీటీపై పడినట్టు తెలుస్తోంది. సినిమా రంగంలో ఓటీటీ నయా బిజినెస్ మోడల్ అయి కూర్చుంది. అందుకే బడా నిర్మాతలంతా ఓటీటీపై కన్నేశారు. రామోజీ కూడా ఓటీటీ వ్యాపారం మొదలెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైపోయింది.
ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన దాదాపు 80 సినిమాలు ఈటీవీ దగ్గర ఉన్నాయి. ఇవి ఈటీవీలో ప్రసారం అయినప్పుడు చూడాలి తప్ప, బయట ఎక్కడా కనిపించవు. కనీసం యూ ట్యూబ్లో కూడా ఉండవు. అవి కాకుండా.. కేవలం ఈటీవీ దగ్గరే ఉన్న సినిమాలు వందల కొద్దీ ఉన్నాయి. ఈటీవీ ప్రారంభమైనప్పుడు 99 ఏళ్లకు లీజుకు తీసుకున్న సినిమాలవి. అప్పుడు శాటిలైట్ హక్కులపై అంత అవగాహన, వాటికి అంత డిమాండ్ లేకపోవడంతో ఈటీవీ చాలా చీప్ గా కొనేసింది. ఇవన్నీ ఓటీటీకి అదనపు బలాలు. ఈటీవీ దగ్గర ఉన్న సినిమాలు, ఈటీవీ ఇది వరకే కొనుక్కున్న సినిమాలు ఓటీటీకి బ్యాంక్ గా పనికొస్తాయి. ఉషాకిరణ్ మూవీస్ పై సినిమాలు తీసి, వాటిని ఓటీటీలో విడుదల చేసుకోవడం మరో ఆప్షన్. అందరిలానే.. చిన్నా, పెద్ద సినిమాల్ని మంచిరేటుకి కొనుగోలు చేసి, ముందు ఓటీటీలోనూ, ఆ తరవాత.. ఈటీవీలోనూ ప్రసారం చేసుకోవొచ్చు. రామోజీ ఏం చేసినా భారీగా ఉంటుంది. అందుకే దాదాపు వంద సినిమాల వరకూ కొనుగోలు చేసి, ఆ తరవాత… ఏటీటీని లాంఛనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈటీవీ కూడా ఓటీటీలోకి దిగితే.. ఈ రంగంలో మంచి పోటీ ఏర్పడడం ఖాయం.