“అమ్మను, తాజ్‌మహల్‌ను మనమే వెళ్లి చూసి రావాలి…మన దగ్గరకు రావాలని కోరుకోకూడదు” అంటాడు.. ఓ సినిమాలో త్రివిక్రమ్. దీన్ని మనం కొద్దిగా విస్తరించుకుని “అప్పు అడిగడానికి…సాయం అడగడానికి” కూడా మనమే వెళ్లాలి కానీ… వాళ్లను రమ్మని కోరుకోకూడదని చెప్పుకోవాలి. ఈ విషయం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి తెలిసి ఉండదు. ఆయనకు తెలుగు రాదు.. వచ్చినా తెలుగు సినిమాలు చూసేంత తీరిక ఉండదు. అందుకే తెలియకపోవడం ఆయన తప్పు కాదు. కానీ తెలియకపోవడం వల్ల ఓ తప్పు చేసేశారు. తర్వాత చింతించారు. తప్పు దిద్దుకున్నారు. కాదు దిద్దుకోవాల్సి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగిందంటే… అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి మద్దతివ్వాలని… వెళ్లిన ప్రతి రాష్ట్రంలోనూ.. ముగ్గురు నలుగురు ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని కలిసి.. బీజేపీ సాధించిన విజయాల పాంప్లెట్లు పంచి ..మళ్లీ మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి “సంపర్క్ ఫర్ సమర్థన్” అనే పేరు పెట్టుకున్నారు. అలా.. తెలంగాణకూ వచ్చినప్పుడు … ముగ్గుర్ని కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ ముగ్గురు రామోజీరావు, సైనా నెహ్వాల్, శ్రీనిరాజు. మిగతా ఇద్దరూ సిటీలోనే ఉంటారు… కాబట్టి ప్రాబ్లం ఉండదు.. కానీ రామోజీరావు ఫిల్మ్ సిటీలో ఉంటారు. సిటీ నుంచి వెళ్లి రావడానికి రెండు గంటల సమయం పడుతుంది.
అందుకే అమిత్ షా… రామోజీరావుకు చాలా కార్డియల్గా కొంత సమచారం పంపారు. “చాలా బిజీ షెడ్యూల్ ఉంది. ఏమీ అనుకోకుండా.. మీరు సిటీలోకి వస్తే… నేను పద్దతిగా మీ వద్దకు మద్దతు కోరుతారను అని..”. కచ్చితంగా రామోజీరావుకి త్రివిక్రమ్ డైలాగ్ గుర్తొచ్చే ఉంటుంది. ఇప్పుడు నువ్వొచ్చి మద్దతు అడగకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి పర్వాలేదు… పని చూసుకో అని అంతకంటే పద్దతిగా సమాధానం పంపారట. దీంతో అమిత్ షాకు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. దూరాభారం చూసుకోకుండా.. సమయం, సందర్భం పట్టింపుల్లేకుండా.. ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావును కలిసి ” సంపర్క్ ఫర్ సమర్థన్” కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చారు.
ఈ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ నేతలు ఒకటే చెవులు కొరుక్కుకున్నారు… “రాజగురు” అని రామోజీరావు అంటే పడని వాళ్లు సెటైర్లు వేస్తారేమో కానీ.. సిట్యూయేషన్ చూస్తూంటే.. అదే నిజమైపోయిందని…తేల్చేసుకున్నారు.