ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి పార్టీ అధినేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఉగ్రవాద నిరోధానికి ఒక మంచి చిట్కా చెప్పారు. ఆయన డిల్లీలో ఒక ప్రముఖ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “మోడీ లాహోర్ పర్యటన వలన రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ బలపడతాయని నేను విశ్వసిస్తున్నాను,” అని అన్నారు. భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అవుతాయనే బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ జోస్యంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబిస్తూ “అది సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే మూడు దేశాలు కలిసికట్టుగా పనిచేయవలసి ఉందని చెప్పగలను. అందుకోసం మూడు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యానికి సిద్దపడితే మంచిది. అలాగే మూడు దేశాలకు ఒకే కరెన్సీని అమలుచేయగలిగితే చాలా ప్రయోజనం ఉంటుంది. దాని వలన మూడు దేశాల ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారుల మధ్య సంబంధాలు పెరిగి బలపడతాయి. అప్పుడు ఉగ్రవాదం దానంతట అదే కనబడకుండా మాయం అయిపోతుందని నేను భావిస్తున్నాను,” అని పాశ్వాన్ అన్నారు.
మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న పాశ్వాన్ ఈ మాట చెపుతున్నారు అంటే అది మోడీ ప్రభుత్వ ఆలోచనగా భావించాలామో? ఎప్పటికప్పుడు ఇటువంటి విప్లవాత్మకమయిన ఆలోచనలతో ముందుకు వచ్చే ప్రధాని నరేంద్ర మోడి ఈ వినూత్న ఆలోచనపై దేశ ప్రజల, రాజకీయపార్టీల, సంబంధిత రంగాల నిపుణుల అభిప్రాయం కోరుతున్నారనుకోవాలేమో? ఒకవేళ ఆ ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చినట్లయితే అప్పుడు మోడీ ప్రభుత్వం దానిని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాలని భావిస్తోందేమో?