తెలంగాణ రాజకీయాల్లో పూర్తి స్థాయి మార్పు కనిపిస్తోంది. మతం హైలెట్ అవుతోంది. అదే పనిగా కుల, మతాలను వాడేసుకుంటున్నారు. తాజాగా రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ఓ గంట వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై బీజేపీ రచ్చ ప్రారంభించింది. ఇలాంటి అవకాశం హిందూ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించడం ప్రారంభించారు.
రంజాన్ మాసంలో ఎప్పుడూ ఇచ్చే ఉత్తర్వులే
రంజాన్ మాసంలో ఉద్యోగులు ఓ గంట ముందు వెళ్లేందుకు చాలా కాలంగా ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. వారు స్పెసిఫిక్ గా ఆ సమయంలో ప్రార్థనలకు వెళ్లాలి కాబట్టి ఆ అవకాశం కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇది ఉంది. ఎప్పుడూ ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు.కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి చాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ముస్లిం ఉద్యోగులు ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశం ఇస్తే మీకేం ఇబ్బంది అని అంటారని.. హిందువులకు ఇవ్వలేదు కదా అంటున్నారు. ఇక్కడే అసలు రాజకీయం ఉంది.
అందరికీ ఇచ్చామని వివరణ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్
బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు తామేదో తప్పు చేసినట్లుగా కాంగ్రెస్ వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. హిందూ పండుగల సమయంలో కూడా అవసరమైనప్పడల్లా సడలింపులు ఇస్తూనే ఉంది. అదేమీ కొత్త కాదు. అయినా ఏమీ ఇవ్వడం లేదని బీజేపీ ఆరోపించడం.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇది ఆ చర్చను అంతకంతకూ పెంచుతుంది కానీ ఏ మాత్రం తగ్గించదని తెలిసి కూడా .. కాంగ్రెస్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
మత రాజకీయాలు ప్రమాదకరం
ముస్లింలకు ఓ గంట ముందు వెళ్లే అవకాశం కల్పించడం ఇదే మొదటి సారి కాదు. కాంగ్రెస్ మాత్రమే కల్పించలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా కల్పిస్తుంది. అది ఓటు బ్యాంక్ రాజకీయం కాకపోవచ్చు. బీజేపీ. ప్రభుత్వం వస్తే ఇలాంటి చాన్స్ ఇవ్వకపోవచ్చు కానీ దాని వల్ల ఆ వర్గంలో ద్వేషం పెరుగుతుంది తప్ప.. మరో రాజకీయం ఉండదు. అలాంటివి సెక్యూలర్ రాజకీయాలకు సరిపడవు. సెక్యూలర్ అంటే.. పరమత సహనం. అది లేకపోతే సమస్యలు వస్తాయి.