‘బాహుబలి’లో భల్లాలదేవగా భారీ దేహంతో కనిపించిన రానా ఇటీవల బాగా సన్నబడ్డాడు. దీనికి కారణం అతడికి ఏవో ఆరోగ్య సమస్యలు వచ్చాయని పుకార్లు వినిపించాయి. తాజా ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఎన్టీఆర్’ సినిమా కోసం బరువు తగ్గానని రానా చెప్పారు. అందులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే. “భల్లాలదేవ కాబట్టి భారీగా వున్నాడు. ఇప్పుడు చంద్రబాబుగారి పాత్రలోకి వెళ్ళాను కదా! ఆ మార్పు చూపించడం కోసమే ఇదంతా. ‘బాహుబలి’ కోసం కండలు పెంచాను. తాజా సినిమా కోసం అవన్నీ తగ్గించేశా” అని రానా తెలిపాడు. ‘చంద్రబాబుని డిట్టో దించేస్తున్నార్ట!’ అని అడగ్గా… “భల్లాలదేవ అంటే కల్పిత పాత్ర. ఎలా ఎలా వుంటాడో ఎవరికీ తెలియదు. అందుకని, ఏం చేసినా… ఎలా చేసినా… రాజమౌళిగారు నాతో ఏం చేయించినా చెల్లింది. చంద్రబాబు నాయుడుగారు మన ఎదుటే వున్నారు కదా! ఆయన్ని డిట్టో దించకపోతే కష్టం” అన్నారు రానా. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రీకరణ బాగా జరుగుతోందని తెలిపాడు. మరికొన్ని రోజులు చిత్రీకరణ చేస్తే అతడి పాత్ర పూర్తవుతుందట! ఇప్పటికే కొన్ని రోజులు రానా షూటింగ్ చేశారు! పాత్ర కోసం చంద్రబాబుతో సమావేశం అయిన సంగతి తెలిసిందే!!