దాదాపు సంవత్సరం క్రితం నుండి మణిరత్నం అనుకుంటున్న సినిమాకు కథానాయకులు దొరక్క తెగ ఇబ్బంది పడ్డాడు. రీ ఎంట్రీ సినిమా ఓకే కన్మణి అదే తెలుగులో ఓకె బంగారంగా విడుదలయ్యింది. ఆ సినిమా సక్సెస్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన మణిరత్నం వెంటనే ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు ప్లాన్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్, కింగ్ నాగార్జునతో ఓ అద్భుతమైన రివేంజ్ డ్రామా ఒకటి రాసుకున్నారట. మహేష్ ఆ ప్రాజెక్ట్ కు ముందు ఓకే అన్నట్టే అనిపించినా తర్వాత మణిరత్నంను నిరాశ పరిచాడు. ఇక మహేష్ నో అని చెప్పడంతో నాగ్ కూడా సారీ అనేశాడు.
తర్వాత అదే సబ్జెక్ట్ ను కార్తి, దుల్కర్ సల్మాన్ లతో తెరకెక్కించాలని ప్రయత్నించగా వారు కూడా హ్యాండ్ ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు రానా, నాగ చైతన్యలను తీసుకున్నారని కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. బావా మరిదులు అయిన రానా, చైతులను ఒకే సినిమాలో నటింపచేసేలా ప్లాన్ చేస్తున్నాడట మణిరత్నం. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయట. మణిరత్నం సినిమా అంటే రానా, చైతన్యలు కాదంటారా చెప్పండి.
ఇప్పటికే ఈ సినిమాలో కథానాయికలుగా కీర్తి సురేష్, నిత్యా మీనన్ లను ఫైనల్ చేసి ఉంచాడు మణిరత్నం. క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. సరికొత్త కలయికలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.