‘హనుమాన్’ తరవాత ప్రశాంత్ వర్మ ప్రకటించిన ప్రాజెక్టుల్లో బ్రహ్మరాక్షస్ ఒకటి. రణవీర్‌సింగ్ తో ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిద్దామనుకొన్నాడు. మైత్రీ మూవీస్ కూడా ముందుకు వచ్చింది. రణవీర్‌తో ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేయించారు. కానీ క్రియేటీవ్ డిఫరెన్సెస్ వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. రణవీర్ తప్పుకోవడంతో మరో హీరోని వెదికి పట్టుకొనే పనిలో పడ్డాడు ప్రశాంత్ వర్మ. నిన్నా మొన్నటి వరకూ ఈ ప్రాజెక్ట్ ని బాలీవుడ్ స్టార్‌తోనే తీయాలనుకొన్నాడు. అయితే ఇప్పుడు మనసు మారినట్టు తెలుస్తోంది. రణవీర్ స్థానంలో ఓ తెలుగు హీరోతో ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయం తీసుకొన్నాడట. ఆ హీరో ఎవరన్నదే పెద్ద ప్రశ్న.
రణవీర్ స్థానాన్ని భర్తీ చేసే హీరోలు తెలుగులో లేకపోలేదు. బ్రహ్మరాక్షస్ అనే టైటిల్ కి తగ్గట్టుగా దేహదారుడ్యం ఉండాలి. పైగా స్టార్ ఇమేజ్ అవసరం. అలాంటి హీరో కోసం అన్వేషణ మొదలెట్టాడు. ప్రస్తుతం ప్రశాంత్ మైండ్ లో రానా ఉన్నట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రానాతో సంప్రదింపులు కూడా మొదలైనట్టు సమాచారం అందుతోంది. ప్రశాంత్ వర్మ ఫామ్, ఐడియాలజీ, మార్కెట్ స్ట్రాటజీ తెలిసిన హీరో ఎవరైనా సరే, ప్రశాంత్ వర్మ తో సినిమా అంటే `నో` చెప్పేదే ఉండదు. అయితే రానా కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయా, లేదా? అనేది చూసుకోవాలి. `జై హనుమాన్`తో పాటు మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన పనుల్ని కూడా సమాంతరంగా చూసుకొంటున్నాడు ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ సినిమా ఆలస్యం అవుతుందనుకొంటే `జై హనుమాన్` స్టార్ట్ చేస్తాడు. అయితే రిషబ్ శెట్టి ‘కాంతార 2’ తరవాతే ఖాళీ అవుతాడు. ఈ గ్యాప్‌లో ‘బ్రహ్మరాక్షస్’ సినిమా పనుల్ని చక్కబెట్టాలనుకొంటున్నాడు ప్రశాంత్ వర్మ. అందుకే హీరోల కోసం అన్వేషణలో పడ్డాడు. ‘బ్రహ్మరాక్షస్’కు రానా మంచి ఆప్షనే. కానీ ఫైనల్ గా ఎవరుంటారన్నది చూడాలి.