రానా చేతిలో మంచి సినిమాలున్నాయి. బాహుబలి లాంటి ఇండ్రస్ట్రీ హిట్ ఉంది. అయినా.. ఏదో లోటు. సోలోగా వస్తే.. చూస్తారా? కమర్షియల్ హిట్ దక్కుతుందా? ఇలా సవాలక్ష ప్రశ్నలు. సోలో హీరోగా రానాకి అంత సీన్ లేదని, రానా ఎప్పుడూ ఫీల్ గుడ్ సినిమాలే చేస్తాడని, కమర్షియల్‌గా బాక్సాఫీసు దగ్గర వసూళ్ల గలగలలు వినిపించే కథలు ఎంచుకోలేడని చాలా చాలా విమర్శలు వినిపించాయి. వాటన్నింటికీ ‘నేనే రాజు – నేనే మంత్రి’ సినిమాతో సమాధానం చెప్పేశాడు రానా. బాక్సాఫీసు దగ్గర మూడు సినిమాల పోటీ ఉన్నా సరే, తేజకు హిట్లు లేకపోయినా సరే, ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోయినా సరే… `నేనే రాజు`కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయంటే నిజంగా కమర్షియల్ హీరోగా రానా స్టామినా పెరిగినట్టే.
నితిన్‌కు పవన్ కల్యాణ్ అభిమానుల మద్దతు కావల్సినంత ఉంది. పైగా ‘లై’ సినిమాపై భారీ అంచనాలు. దాంతో… ‘లై’ సినిమాకే ఎక్కువ టికెట్లు తెగుతాయని అనుకొన్నారు. బోయపాటి సినిమాలకు మాస్లో మంచి పలుకుబడి ఉంది. మాస్ అండతో జయ జానకి నాయకకు వసూళ్లు ఎక్కువ వస్తాయని, ఈ రెండు సినిమాల తరవాతే.. రానా సినిమాని పట్టించుకొంటారని భావించిన ట్రేడ్ వర్గాల లెక్కలు రానా దూకుడుతో చెల్లా చెదురు అయిపోయాయి. తొలి షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో.. రానాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది. సక్సెస్ మీట్లో కూడా ‘ఇన్ని వసూళ్లు నా సినిమాకేనా అని ఆశ్చర్యపోయా’ అని రానా బయటపడిపోయాడంటే… ఇది రానా అంచనాల్ని మించిన విజయమే అనుకోవాలి. రానా దెబ్బకు ‘లై’ బాగా డల్ అయిపోయింది. ఈ హిట్టుతో అటు తేజకు, ఇటు రానాకు కావల్సినంత రిలీఫ్ దొరికినట్టైంది. రానాతో సోలోగా ప్రయోగాలు చేద్దామనుకొన్నవాళ్లకు నిజంగా… ‘నేనే రాజు..’ సరికొత్త ఉత్సాహాన్ని నింపినట్టైంది.