ఈవారం వస్తున్న సినిమాల్లో ’35.. చిన్న కథ కాదు’ ఒకటి. రానా ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నివేదా థామస్, ప్రియదర్శి, భాగ్యరాజా, గౌతమి లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాకు బలం. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. సినిమాలో ఏదో విషయం ఉందన్న సంగతి అర్థం అవుతోంది. ఎంత మంచి సినిమా తీసినా, ఆర్థికంగా సేఫ్ అవ్వడం చాలా అవసరం. ఈ విషయంలో ’35’ సినిమా సేఫ్ అయిపోయింది. దాదాపు రూ.6.5 కోట్లతో తీసిన సినిమా ఇది. నెట్ ఫ్లిక్స్ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకొంది. అందుకోసం రూ.7.5 కోట్లు చెల్లించింది. అంటే… ఓటీటీతోనే ఈ సినిమా గట్టెక్కేసిందన్నమాట.
ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ జరిగితే చాలు. ఆ రూపంలో వచ్చిందంతా లాభమే. విడుదలకు వారం రోజుల ముందు నుంచే చిత్రసీమలోని కొంతమంది ప్రముఖులకు స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశాడు రానా. అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. హీరో నాని ముందుకొచ్చి ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఓవైపు తన సినిమా ‘సరిపోదా శనివారం’ థియేటర్లలో ఆడుతోంది. అయినా సరే, చిన్న సినిమాకు మద్దతుగా నిలిచాడు. ఈరోజుల్లో భారీ కమర్షియల్ హంగులతో వస్తున్న పెద్ద సినిమాలే నిర్మాతల్ని ముంచేస్తున్నాయి. అలాంటిది. ఓ చిన్న సినిమా. విడుదలకు ముందే సేఫ్ అయిపోవడం గొప్ప విషయమే. అంతకంటే ఓ సినిమాకు కావల్సిందేముంది?