తేజ ‘అహింస’ డిజాస్టర్ల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా తొలి రోజే.. తొలి షోకే థియేటర్లు ఖాళీ. ఎంత ప్రచారం చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, జనం థియేటర్లకు రాలేదు. ఈ సినిమాతో పోలిస్తే `నేను స్టూడెంట్ సార్` వసూళ్లే బాగున్నాయి. `అహింస` తరవాత తేజ పరిస్థితి ఏమిటన్నది పెద్ద ప్రశ్నార్థకం.
అయితే తేజ తెలివిగా రానాని ముందే లాక్ చేసేశాడు. ‘అహింస’ విడుదలకు ముందే రానాతో ఓ సినిమా కమిట్ అయిపోయాడు. రానా ఎక్కడ మాట వెనక్కి తీసుకొంటాడో అనిపించి, అహింస ప్రీ రిలీజ్ వేడుకలో సభా ముఖంగా రానాతో తన సినిమా ఉందని ప్రకటించాడు. నిర్మాత కూడా సిద్ధమే. రానాకి అడ్వాన్సు కూడా అంతేసింది. వేడి తగ్గక ముందే ఈ సినిమాని లాంఛనంగా మొదలెట్టేయాలనుకొంటున్నాడు తేజ. ఈనెల 6న రామానాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి కొబ్బరి కాయ కొట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అహింస రిపోర్ట్ చూశాక ఏ హీరోకైనా తేజతో సినిమా చేయాలంటే భయం పట్టుకొంటుంది. `నేనే రాజు – నేనే మంత్రి` లాంటి హిట్ ఇచ్చినప్పటికీ, రానాకీ ఇలాంటి భయమే ఉంటుంది. ఈ సినిమాకి కమిట్ అయి ఇరుక్కుపోయాడు రానా. ఇప్పుడు ముందుకూ వెళ్లలేడు. వెనక్కీ రాలేడు. మరి ఈ రానా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకొంటాడో..?!