సౌత్ ఇండియన్ కథలపైనే కాదు, ఇక్కడి దర్శకులు, నటీనటులపై ఫోకస్ పెడుతున్నారు బాలీవుడ్ జనాలు. మొన్నటికి మొన్న.. తన సినిమాలో వెంకటేష్ కోసం ఓ కీలక పాత్ర అప్పగించాడు సల్మాన్ ఖాన్. అంతేకాదు.. రామ్ చరణ్‌కీ తన సినిమాలో స్థానం ఇచ్చాడు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అదే చేయబోతున్నాడని టాక్.
షారుఖ్ – అట్లీ కాంబినేషన్ లో జవాన్ అనే సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం సౌత్ ఇండియన్ స్టార్‌ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఆ అవకాశం రానాకి దక్కిందని టాక్. చిత్రబృందం ఇప్పటికే రానాతో సంప్రదింపులు మొదలెట్టిందని సమాచారం. బాలీవుడ్ లో అడపా దడపా మెరిసినా.. ఇప్పటి వరకూ సరైన బ్రేక్ రాలేదు రానాకి. కాకపోతే.. అక్కడ తనకు మంచి గుర్తింపే ఉంది. షారుఖ్ – అట్లీ కాంబోపై చాలా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాల్ని అమాంతంగా పెంచేసింది. అందుకే రానా ఈ ఆఫర్‌కి నో చెప్పే అవకాశాలు కనిపించడం లేదు. రానా యాడ్ అయితే.. ఈ సినిమాకి మరింతగా సౌత్ ఇండియన్ సినిమా ఫ్లేవర్ రావడం ఖాయం. గతంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా కూడా పూర్తిగా సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌తోనే తీశాడు షారుఖ్. ఆ తరవాత.. తను మరో హిట్ అందుకోలేకపోయాడు. అందుకే మరోసారి సౌత్ ఇండియన్ రెసిపీని నమ్ముకొన్నట్టున్నాడు.