సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటుంది లక్ష్మీ ప్రసన్న. వెండి తెరైనా, బుల్లి తెరైనా, సోషల్ మీడియా అయినా – ఏదో ఓ రూపంలో ప్రేక్షకులకు టచ్‌లో ఉండడం నేర్చుకుంది. ఈ లాక్ డౌన్ సమయంలో.. ఇన్స్ట్రాగ్రామ్లోనే సెలబ్రెటీల్ని ఇంటర్వ్యూలు చేసి, కొత్త అవతారం ఎత్తింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల స్క్రిప్టుల్ని తయారు చేసుకుంటోంది. ఈసందర్భంగా మంచు వారి అమ్మాయితో చిట్ చాట్ ఇది.
* ఈ లాక్ డౌన్ ఎలా గడిచింది?
– నాకైతే లాక్ డౌన్ లా లేదు. సెలవలు వచ్చినట్టు అనిపించింది. ఇది వరకు నా జీవితం అంతా సిస్టమాటిక్ గా ఉండేది. ఇన్నింటికి లేవాలి, ఇన్ని గంటలు జిమ్ చేయాలి, ఈ రోజు.. ఈ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి.. అని ఓ టైమ్ టేబుల్ ఉండేది. దాన్ని బ్రేక్ చేశా. నచ్చినప్పుడు లేస్తున్నా, నచ్చింది తింటున్నా. ఇది వరకు రోజుకి 4 జతలు మార్చేదాన్ని. ఇప్పుడు ఒకే ఒక్క టీ షర్ట్ తో సరిపెడుతున్నా. నీటిని ఆదా చేయడం నేర్చుకున్నా. ఇంతకు ముందు వెండి పళ్లాం లోనే భోజనం చేసేదాన్ని. ఇప్పుడు స్టీలు గిన్నెకి వచ్చేశా. నీటిని ఎలా ఆదా చేయొచ్చో.. అన్ని మార్గాల్నీ అన్వేషిస్తున్నా. వృథా ఖర్చు తగ్గించా. పరిమితుల మధ్య బతకడం అలవాటు చేసుకున్నా.
* మానసికంగా ఎలాంటి మార్పు వచ్చింది?
– మానసికంగా చాలా మారాను. ఇది వరకు ఏదో ఓ కంప్లైంట్ ఉండేది. అది లేదు, ఇది లేదు… అని నాన్న దగ్గర అలిగేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తోంది. దేవుడు నాకు ఇన్నిచ్చాడు.. ఇంకేం కావాలి? అనిపించింది. అందుకే ప్రతీరోజూ దేవుడికి దండం పెట్టుకునేదాన్ని. దేవుడు ఏమిచ్చినా మనం స్వీకరించాలి. అది నా కొత్త పాలసీ.
* రోజుల తరబడి ఇంటిపట్టునే ఉండడం ఎలా అనిపించింది?
– కాలేజ్ తరవాత ఇన్ని రోజులు వరుసగా గడపడం ఇదే ప్రధమం. ఇల్లు వదలకుండా ఇన్ని రకాలుగా ఉండొచ్చా? అనేది తెలుసుకున్నా. నాన్నగారికి మెడిటేషన్ నేర్పించా. ఆయనకు ఏం కావాలో… తెలుసుకుని మరీ వండించేదాన్ని. ఇక ఇన్స్ట్రా కోసం సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేశా. ఇవన్నీ సంతృప్తి నిచ్చాయి. అయితే ఏం చేసినా, ఎన్ని చేసినా… సినిమాలు, షూటింగులు లేకపోవడం లోటే కదా?
* ఇన్స్ట్రాలో ఇంటర్వ్యూ రానాతో మొదలెట్టారు. ఇది వరకు ప్రేమతో మీ లక్ష్మీ విషయంలోనూ అంతే. రానా మీ లక్కీ హ్యాండా?
– రానా నా గుండెకాయ.. నేను ఏది అడిగినా నో చెప్పడు. ప్రేమతో మీ లక్ష్మి.. తొలి ఇంటర్వ్యూకి తనే వచ్చాడు. తన వల్ల ఆ షోకి అంత గొప్ప స్పందన లభించింది. దొంగాట కోసం ఓ పాటలో స్టార్సందరినీ తీసుకొచ్చా. రానానీ పిలిచా. ఆరోజు రానా తో షూట్ చేయాలి. సెట్ రెడీ అయ్యింది. అంతా వచ్చారు. కానీ రానా రాలేదు. అప్పటికి రామానాయుడుగారు చనిపోయి. పది రోజులే అయ్యింది. ఆ టైమ్ లో రానాని పిలవాలా వద్దా? అంటూ సందేహిస్తూనే పిలిచాను. మరో గంటలో సెట్లో వాలిపోయాడు. నాకు స్నేహితులు చాలా ఎక్కువ. పార్టీ అంటే అందరూ పొలోమంటూ వచ్చేస్తారు. కానీ సహాయం అంటే ముందుగా వచ్చేది రానా మాత్రమే.
* కరోనా భయం పోయిందా?
– కరోనా అంటే ఇప్పటికీ భయం ఉంది. భయం లేకుండా లేను. కాకపోతే భయంతో బతకలేం.
పోతే పోదాం.. హ్యాపీగా పోదాం. రోజూ రోజూ టెన్షన్ పడితే ఎలా? కానీ జాగ్రత్తగా ఉందాం.
* ఇలాంటి సమయంలో నాన్న నుంచి ఎలాంటి సపోర్ట్ లభించింది?
– నాకంటే నాన్న ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. మాకేదైనా అయితే చూసుకోవడానికి మా నాన్న ఉన్నారు. ఆయనకు ఎవరున్నారు? ఆయనే మా అందరికీ దిక్కు. మాకు స్కూళ్లు, కాలేజీలూ ఉన్నాయి. వాటి గురించి నాన్న ఎక్కువ బెంగ పెట్టుకున్నారు. మొన్నే హైదరాబాద్ నుంచి తిరుపతి కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు.
* లాక్ డౌన్‌తో నేర్చుకున్న పాఠం?
– ప్రతీ యేడాది కనీసం పది రోజులు స్వచ్ఛందంగా హోం క్వారెంటెన్ లో ఉండాలి. ఆ పది రోజులూ
ఫ్యామిలీకే కేటాయించాలి. అప్పుడే కుటుంబానికి మనం సరైన సమయం కేటాయించినట్టు. ప్రతీ ఒక్కరూ అందుకు సిద్ధ పడితే మంచిది.
* ఈ టైమ్ లో స్క్రిప్టులు రెడీ చేసుకున్నారా?
– ఓటీటీ కోసం, కొన్ని సినిమాల కోసం స్క్రిప్టులు తయారు చేయిస్తున్నా. తక్కువ మంది సభ్యులతో ఎలాంటి కథల్ని ఇప్పటికిప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్లగలను? అనే విషయాల్ని ఆలోచిస్తున్నా.
* ఈమధ్య సినిమాలు పెద్దగా చేయడం లేదు. కారణం?
– వైఫ్ ఆఫ్ రామ్ తరవాత తమిళంలో ఓ సినిమా చేశాను. వచ్చిందల్లా చేయాలని లేదు. చేస్తే.. నేనే చేయాలి అనే పాత్రలు రావాలి. నెగిటీవ్ రోల్స్ కూడా చేస్తా. నా కెరీర్ మొదలయ్యిందే… నెగిటీవ్ రోల్‌తో. ఈమధ్య నాకు నచ్చిన పాత్రలు రావడం లేదు. వైఫ్ ఆఫ్ రామ్ ఇక్కడ సరిగా ఆడలేదు. హిందీ డబ్బింగ్ విడుదల చేస్తే యూ ట్యూబ్‌లో మామూలుగా చూళ్లేదు జనాలు. లక్ష్మీబాంబ్ కూడా యూ ట్యూబ్‌లో బాగా ఆడింది. సినిమా బాగోలేకపోతే… అక్కడ లక్షల మంది ఎందుకు చూస్తారు?
* స్త్రీ సమస్యల నేపథ్యంలో బాలీవుడ్ తో పోలిస్తే…. మన దగ్గర సినిమాలు సరిగా రావడం లేదు అంటున్నారు?
– తీస్తే చూసే జనం ఏరి? వైఫ్ రామ్ తీశా కదా. కానీ స్పందన రాలేదు. బాలీవుడ్ లో వచ్చిన తప్పడ్ సినిమా చూశా. నాకు సిగ్గేసింది. కొన్ని విషయాల్ని చూసీ చూడనట్టు ఉండిపోవాలి. ప్రతీదానికీ పోరాడలేం. ఎక్కడ పోరాడాలో తెలుసుకోవాలి.