టాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతమైన దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. గులాబీ, సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, అంతఃపురం… ఇలా తన మార్క్ సినిమాలతో చెలరేగిపోయాడు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు కృష్ణవంశీ నుంచి సరైన సినిమా రావడం లేదు. ‘నక్షత్రం’ అయితే డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ ఫ్లాప్ నుంచి బయటపడి కొత్త సినిమావైపు దృష్టి పెట్టాడు కృష్ణవంశీ. ఈసారి కూడా మల్టీస్టారరే చేస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోలుంటారు. రానా, మాధవన్ ల పేర్లు ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నాయి. మాధవన్కి ఇటీవలే కథ చెప్పేశాడు కృష్ణవంశీ. తన దగ్గర నుంచి నిర్ణయం రావాల్సివుంది. రానా అయితే ఎప్పటి నుంచో కృష్ణవంశీతో చేయడానికి రెడీగా ఉన్నాడు. మూడో హీరో ఎవర్నది తెలియాలి. ఖడ్గం స్థాయిలో ఓ ఎమోషనల్ డ్రామాని వెండి తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు కృష్ణవంశీ. స్క్రిప్టు కూడా పక్కాగా సెట్ అయిపోయింది. మాధవన్, రానాల డేట్లు చూసుకోవడం, మూడో హీరోని సెట్ చేయడం.. అయిపోతే ఓ అధికారిక ప్రకటన వచ్చేస్తుంది.