వెంకటేష్, రానా తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడం… అది నెట్ ఫ్లిక్స్ వేదికగా అన్ని భాషల్లో విడుదల కావడంతో.. `రానా నాయుడు`పై దృష్టి పెట్టారు తెలుగు ప్రేక్షకులు. ఈ సిరీస్‌లో వెంకీ గెటప్ కూడా సరికొత్తగా ఉంది. అందుకే వెంకీ ఫ్యాన్స్ ఇంకాస్త ఆసక్తి చూపించారు. మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో `రానా నాయుడు` విడుదలైంది. తీరా చూస్తే… ఆ వెబ్ సిరీస్ నిండా అడల్ట్ కంటెంటే. డీ గ్రేడ్ సినిమాలో ఉండాల్సిన సెక్స్ సన్నివేశాలు, బూతు మాటలు ఎడా పెడా.. ఈ వెబ్ సిరీస్ నిండా కనిపిస్తున్నాయి. తొలి ఎపిసోడ్‌లోని తొలి సన్నివేశంలోనే దర్శకుడు తన పైత్యం మొత్తం చూపించేశాడు. ఆ తరవాత ప్రతీ ఎపిసోడ్ లోనూ ఇలాంటి ఆణిముత్యాలు ఒకట్రెండు తగులుతూనే ఉన్నాయి.
‘ఈ కంటెంట్ చాలా బోల్డ్ గా ఉంటుంది.. ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడొద్దు..’ అంటూ ముందస్తు హెచ్చరికగా వెంకటేష్ ముందే చెప్పేశాడు. బోల్డ్ కంటెంట్ అంటే.. బూతులు అనుకొంటారు. అవి.. ఈరోజుల్లో కామన్ అయిపోయింది. పైగా వెబ్ సిరీస్ అంటే.. ఆ తరహా సంభాషణలు ఉండడం సహజం అనుకొనే స్థాయికి వచ్చారు జనాలు. అయితే… రానా నాయుడు అంతకు పది రెట్లు ఎక్కువ ఉంది. ముఖ్యంగా అసహజ శృంగార సన్నివేశాలతో నింపేశారు. బహుశా.. దీనికంటే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సిరీస్‌లు నెట్ ఫ్లిక్స్ నిండా చాలానే ఉండొచ్చు.కాకపోతే…ఇది వెంకీ చేసిన సిరీస్. ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువ. వాళ్లంతా మన వెంకీ ఉన్నాడు కదా అని సిరీస్ చూస్తే.. ఏంటి పరిస్థితి? ఇప్పటి వరకూ క్లీన్ ఇమేజ్ ఉన్న వెంకీ చేయాల్సిన సిరీస్ ఇదా? కచ్చితంగా వెంకీ ఇమేజ్‌కి ఇది డామేజీ కలిగించేదే. ఇప్పటికే సోషల్ మీడియాలో… విసుర్లు మొదలైపోయాయి. ఇలాంటి చెత్త కంటెంట్ ఉన్న సిరీస్‌లో వెంకీ, రానాలు ఎలా నటించారంటూ.. వాళ్ల అభిమానులే నేరుగా అడుగుతున్నారు. మేం… ట్రెండ్ ని బట్టి ఫాలో అయిపోయాం అని వెంకీ, రానాలు చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే సెక్స్, అడల్ట్ కంటెంట్ తో వెబ్ సిరీస్‌లు, సినిమాలు నడిచే కాలం పోయింది. కంటెంట్ కి బ్రహ్మరథం పడుతున్న కాలంలో ఉన్నాం. అలాంటప్పుడు గొప్ప కథలు చెప్పాల్సి పోయి.. ఇలా దిగజారిపోయే పరిస్థితుల్లో పడడం.. వెంకీ లాంటి స్టార్ హీరోకి, రానా లాంటి ఎదుగుతున్న నటుడికీ సరి కాదు.