తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు. కథలో ఎన్ని కష్టాలున్నా… శుభం కార్డు పడేసరికి అన్నీ క్లియర్ అయిపోవాలి. హ్యాపీ ఎండింగ్ పడిపోవాలి. అప్పుడు అందరూ నవ్వుకొంటూ బయటకు వస్తారు. యాంటీ క్లైమాక్స్‌ని జీర్ణించుకొన్న సందర్భాలు చాలా చాలా అరుదు. గీతాంజలి లాంటి ఒకట్రెండు సార్లు మినహా.. యాంటీ క్లైమాక్స్‌ని అంగీకరించిన దాఖలాలు లేవు. హీరో చనిపోయే కథల్ని తీయడానికి నిర్మాతలు కూడా ముందుకు రారు. ‘క్లైమాక్స్ ఒక్కటీ మార్చేయండి’ అంటూ దర్శకులతో మళ్లీ కొత్తగా రాయించుకొంటారు. తమిళ ‘రమణ’లో కథానాయకుడు చనిపోతాడు. తెలుగు ‘ఠాగూర్’లో చిరంజీవి చనిపోతే చూళ్లేరు కాబట్టి – ఆ క్లైమాక్స్‌ని మార్చేశారు. యాంటీ క్లైమాక్స్ అంటే అంత భయం మనోళ్లకి.
అయితే.. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మాత్రం రానా పాత్రని ఊరితీసేశారు. ఆ విధంగా ఈ సినిమా యాంటీ క్లైమాక్సే. ఆఖరికి కాజల్ కూడా చనిపోతుందట. హీరో – హీరోయిన్లు చనిపోతే ఇంకేం ఉంటుంది? అయితే ఈ క్లైమాక్స్‌ని మార్చమని తేజపై కాస్త ఒత్తిడి తీసుకొచ్చారట సురేష్ బాబు. కాకపోతే ఈ కథకు క్లైమాక్సే బలం అని నమ్మిన తేజ.. క్లైమాక్స్ మార్చడానికి అంగీకరించలేదు. ఈ యాంటీ క్లైమాక్స్ ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనే భయం ఇప్పటికీ డి.సురేష్‌బాబుని వెంటాడుతోందట. సురేష్ బాబు, రానా భయపడుతోన్నది ఈ క్లైమాక్స్కేనని తెలుస్తోంది. మరి ఆ భయాలు ఏమవుతాయో చూడాలి.