బాహుబలి తరవాత విలన్ పాత్రలకు ఓ పర్ఫెక్ట్ ఆప్షన్ రానా రూపంలో దొరికింది. అయితే… రానా మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. బడా స్టార్ తన ఎదురుగా ఉంటే తప్ప… విలన్ పాత్రలు చేసేది లేదని భీష్మించుకొని కూర్చుకొన్నాడు. ఇప్పుడు ఆ అవకాశం చిరంజీవి సినిమా రూపంలో వచ్చింది. ఇందులో రానా ప్రతినాయకుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రతినాయకుడి పాత్ర మామూలుగా ఉండదట. రానా ఓ రాక్షసుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. వశిష్ట చిరంజీవి కోసం ఓ సోషియో ఫాంటసీ కథని తయారు చేసుకొన్నాడు. ఇప్పటి వరకూ చూడని ఓ సరికొత్త లోకాన్ని ఈ కథ కోసం సృష్టించబోతున్నాడు. ఆలోకంలో రాక్షసరాజు లాంటి పాత్రలో రానా కనిపించబోతున్నాడని టాక్. రానా గెటప్ కూడా.. హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో డిజైన్ చేస్తున్నారని టాక్. ఈ చిత్రానికి `విశ్వంభర` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. త్రిష ఓ కథానాయికగా ఇప్పటికే ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. మిగిలిన కథానాయికలెవరన్నది త్వరలో తెలుస్తుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతోంది.