తెలుగు360 రేటింగ్: 2.5/5
గాడ్ ఫాదర్ అనే సినిమా ఎంత గొప్ప మేలు చేసిందో… మణిరత్నం, వర్మలాంటి వాళ్లని చూస్తే తెలుస్తుంటుంది. నాయకుడు నుంచి సత్య వరకూ… గాడ్ ఫాదర్ స్ఫూర్తి కనిపిస్తూనే ఉంటుంది. ఆ సినిమాని ఎన్నిరకాలుగా మార్చి తీసినా, ఎన్నిసార్లు తిప్పి తిప్పి కొట్టినా, పిప్పి వచ్చే వరకూ అరగదీసినా – ఇంకా ఏదో మ్యాజిక్ చేస్తూనే ఉంటుంది. అయితే.. వర్మ, మణిరత్నం ఎప్పుడూ… గాడ్ ఫాదర్‌ని నూటికి నూరుపాళ్లూ కాపీ కొట్టడానికి చూడలేదు. అందులోని బలమైన ఆత్మని పట్టుకుని.. వాళ్లవైన ఫ్యాంటూ, షర్టూ తొడిగే ప్రయత్నం చేశారు. అంటే… మనం ఎక్కడి నుంచైనా ఓ పాయింటుని కాపీ కొట్టొచ్చు. కానీ… దాన్ని మనదైన స్టైల్లో ఆవిష్కించగల సత్తా ఉన్నప్పుడే ఇలాంటి కాపీ వ్యవహారాలు వర్కవుట్ అవుతుంటాయి. `నేను కాపీ క్యాట్నే` అని ముందే స్క్రీన్ పై వేసేసి, ఆ తరవాత సినిమా చూపించే తెగువ, తెలివితేటలు ఉన్న సుధీర్ వర్మ – అలాంటి ప్రయత్నం `స్వామి రారా`తోనే మొదలెట్టేశాడు. ఇప్పటి `రణరంగం` చుట్టూ `గాడ్ ఫాదర్` స్ఫూర్తి పేరుకు పోయింది. మరి… సుధీర్ `గాడ్ ఫాదర్`కి తనదైన మేకొవర్ చేయగలిగాడా? లేదా..? ఈ రణరంగంలో సుధీర్ వేసిన ఎత్తులేంటి?
కథలోకి వెళ్దాం. దేవా (శర్వానంద్) ఓ అనాథ. విశాఖపట్నంలో స్నేహితులతో కలిసి బ్లాక్ టికెట్లు అమ్ముతుంటాడు. సరిగ్గా అప్పుడే మద్యపాన నిషేధం విధిస్తుంది ప్రభుత్వం. బ్లాక్ లో టికెట్లు అమ్మడం కంటే.. బ్లాకులో మందు అమ్మడంతో ఎక్కువ సంపాదించొచ్చని `మందు`ల దుకాణం తెరిచేస్తాడు. క్రమంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి – విశాఖపట్నంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. అయితే.. తన సామ్రాజ్యాన్ని వదిలేసి ఎక్కడో స్పెయిన్‌లో ఒంటరిగా బతకాల్సివస్తుంది. ఇదంతా ఎందుకు జరిగింది. ఓ అనాథ.. మాఫియా డాన్‌గా ఎదిగే క్రమంలో ఎదురైన ఒడిదుడుకులేంటి? అనేదే కథ.
నాయకుడు నుంచి ఇలాంటి కథలు వింటూనే ఉన్నాం, సినిమాలు చూస్తూనే ఉన్నాం. ఓ అనామకుడు.. తిరుగులేని శక్తిగా ఎదిగి, ప్రభుత్వాల్ని శాశించే స్థాయికి చేరుకోవడం, దుర్మార్గుల్ని ఎదిరించి, మంచి వాళ్లకు అండగా నిలబడం, ఆ ప్రయాణంలో తన కుటుంబాన్ని, స్నేహితుల్ని కోల్పోవడం – ఇదీ ఈ సినిమాల ఫార్ములా. అచ్చుగుద్దినట్టు రణరంగం కూడా ఇలానే ఉంటుంది. ఈ సినిమాకి గాడ్ ఫాదర్ స్ఫూర్తి అని ముందే అర్థమైపోతుంది. కథ ఎక్కడి నుంచైనా తీసుకో, ఎక్కడి నుంచైనా కాపీ కొట్టు.. సినిమాకి మాకు అర్థమయ్యేలా, నచ్చేలా చెప్పు చాలు.. అనుకుంటారు ప్రేక్షకులు. అయితే ఆ విషయంలో సుధీర్ వర్మ పూర్తిగా విఫలమయ్యాడు. స్పెయిన్ లో ఇప్పటి శర్వాని చూపిస్తూ… కథ మొదలెట్టారు. టేకాఫే స్లో పేజ్‌తో మొదలైంది. కాస్త ప్రజెంట్, కాస్త ఫ్లాష్ బ్యాక్ అంటూ.. ఈ కథ జంబ్లింగ్ చేస్తుంటుంది. కొన్ని కథలకు ఈ తరహా స్క్రీన్ ప్లే బాగా వర్కవుట్ అవుతుంది. ఇంకొన్ని కథలకు అదే మైనస్ గా మారుతుంది.
రణరంగంకు ప్రజెంట్, ఫ్లాష్ బ్యాక్ స్క్రీన్ ప్లే బాగా ఇబ్బంది పెట్టింది. కాసేపు ఇది.. కాసేపు అది అంటూ రెండు కథల్ని చెప్పేసరికి.. ఏ పాత్రనీ, ఏ సన్నివేశాన్నీ, ఏ కాలాన్నీ పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు ప్రేక్షకుడు. అలా కాకుండా… కథని స్ట్రయిట్ నేరేషన్లో చెబితే ఇంకొంచెం మెరుగైన ఫలితం వచ్చి ఉండేది.
తొలిసగంలో సుదర్శన్ కామెడీ కాస్త ఉపశమనం కలిగిస్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో లవ్ స్టోరీ కాస్త స్లో ఫేజ్‌లో సాగినా – బాగున్నాయి అనిపించే సన్నివేశాలు అవే. లవ్ స్టోరీతో పాటు, సుదర్శన్ పాత్ర ఎప్పుడైతే ఎండ్ అయ్యిందో, అప్పటి నుంచీ.. సినిమాలో వినోదం అంటూ లేకుండా పోయింది. సీరియస్ సినిమాని సీరియస్‌గానే చెప్పాలి, సీరియస్ కోణంలోనే చూడాలి అనుకున్నప్పుడు ఆ మాత్రం వినోదం కూడా ఉంచి ఉండాల్సింది కాదు.
అనాథ – డాన్‌లా మారడం, తిరుగులేని శక్తిగా ఎదగాలని ఎదగడం – ఇవన్నీ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలే. హీరో ఎదుగుదలని ప్రేక్షకుడూ ఆస్వాదిస్తుంటాడు. కానీ.. ఆ క్రమం ఆకట్టుకునేలా ఉండాలి. ఆ పాత్రపై సానుభూతి,ప్రేమ కలిగినప్పుడు, ఆ పాత్రతో ప్రేక్షకుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే ఆ సన్నివేశాలు వర్కవుట్ అవుతాయి. కానీ సుధీర్ వర్మ అవేం పట్టించుకోలేదు. `దొంగ సరుకుని అమ్మైనా సరే డబ్బులు సంపాదించాలి` అనే పరిస్థితి హీరోకి కల్పించలేదు. అలాంటప్పుడు హీరో అనాథ అయితే ఏంటి? డాన్ అయితే ఏమిటి? కాజల్ పాత్రని దర్శకుడు ఎందుకు సృష్టించాడో, ఆ పాత్ర కోసం కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాదు. కాజల్ కీ ఓ పాట ఇచ్చారు. కానీ… దాన్ని వాడుకున్నది ఎప్పుడు? ఎండ్ టైటిల్స్లోనా??
ప్రధమార్థాన్ని కొంత వరకూ భరించొచ్చు. మరీ అంత నీరసించి పోం. కానీ ద్వితీయార్థంలో మిగిలిన ఆ సత్తువ కూడా దర్శకుడు లాగేసుకున్నాడు. కథ ఎటు పోతోందో? ఎందుకు హీరో, విలన్లు దాగుడు మూతలు ఆడుతున్నారో అర్థం కాదు. చివర్లో ఏదో ఓ భయంకరమైన ట్విస్టు ఉండి ఉంటుందిలే… అని ప్రేక్షకుడు ఆశించడం ఖాయం. వాళ్ల ఆశల్ని నిలబెడుతూ.. ఓ ట్విస్టు ఇచ్చాడు దర్శకుడు. కాకపోతే… అది కూడా తుస్సుమంటుంది. ఇలాంటి కథని శర్వాలాంటి హీరో ఒప్పుకోవడం, హారిక హాసిని లాంటి సంస్థ కోట్లు ఖర్చు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
శర్వా పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయి. తనలోని నటుడికి పని పడింది. ఆ పరీక్షలో శర్వా కూడా పాసయ్యాడు. తన పాత్రలు చూసి ముగ్థుడై… ఈ సినిమా ఒప్పుకున్న శర్వా, కాస్త కథపైనా దృష్టి పెడితే బాగుండేది. బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఓ అవారా.. ప్రేమికుడిగా శర్వా నటన నచ్చుతుంది. తన హుషారుని ప్రదర్శించే అవకాశం పూర్తి స్థాయిలో దక్కింది. దాదాపు ఇంతే వయసున్న పాత్రని `మళ్లీ మళ్లీ రానీ రోజు`లో శర్వా చేసేశాడు. కానీ అక్కడ శర్వాని నలభై ఏళ్లు పైబడిన వాడిలా చూడ్డానికి మనసు కూడా అంగీకరిస్తుంది. అది కథలో ఉన్న మ్యాజిక్. అది `రణరంగం`లో లేకపోవడం వల్ల శర్వా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు. మురళీ శర్మ కాస్త వెరైటీగా కనిపించే ప్రయత్నం చేశాడు. `ఇంద్రుడు చంద్రుడు` ఎఫెక్ట్ పడిందేమో… కమల్ హాసన్ లా కనిపించడానికి ఘోరంగా ట్రై చేశాడు. అది వర్కవుట్ అవ్వట్లేదని తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కల్యాణి ప్రియదర్శి చూడ్డానికి మరీ చిన్నపిల్లా అనిపించింది.కాజల్ పాత్ర శుద్ధ వేస్ట్. అసలు ఏం చూసి ఈ పాత్రని ఒప్పుకుందో, ఆమెకే తెలియాలి. కాజల్ కాల్షీట్లు..నిర్మాతల దగ్గర ఉండి ఉంటాయి. వాటిని ఇలా వాడుకున్నారేమో అనుకోవాలి.
టెక్నికల్ గా ఈ సినిమా బాగుంది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ పనితనం ఆకట్టుకుంటుంది. 1995 నేపథ్యాన్ని కళ్లకు కట్టేలా ఆయన తీర్చిదిద్దిన సెట్లు, ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి ప్రయాణించేలా చేశాయి. కాస్ట్యూమ్స్ విషయంలోనూ శ్రద్ద కనిపించింది. తొలి రెండు పాటలూ ఒకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. కెమెరాకీ మంచి మార్కులే పడతాయి. కొన్ని డైలాగులు ఆకట్టుకుంటాయి. కాకపోతే.. మరీ గుర్తుండిపోయేలా మాత్రం లేవు. కథకుడిగా, దర్శకుడిగా సుధీర్ వర్మ తేలిపోయాడు. ఏమాత్రం కొత్తదనం లేని కథని, కొత్తగా చెప్పాలన్న తాపత్రయంలో.. కొన్ని తప్పులు చేసి, పాత కథని మరీ ముతకగా తయారు చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ తెరపై కనిపిస్తున్నా, శర్వా నటుడిగా విజృంభిస్తున్నా – కథ లో విషయం లేకపోవడం వల్ల అవన్నీ తేలిపోయాయి.
ఫినిషింగ్ టచ్: ఓ మై గాడ్ ఫాదర్
తెలుగు360 రేటింగ్: 2.5/5