హైదరాబాద్: సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్లో పందికొక్కు కరవటంపై ఒక సీనియర్ సిటిజన్ దంపతుల జంట రైల్వేశాఖ తమకు రు.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాంచికి చెందిన పీసీ సిన్హా, ఆయన భార్య అల్క గత నెల 30న క్రియా యోగ్ ఎక్స్‌ప్రెస్‌లో రాంచినుంచి హౌరా వెళుతుండగా సిన్హాను పందికొక్కులు కరిచాయి. వారితోపాటు అదే కంపార్ట్మెంట్లో ఉన్న మరో ఇద్దరిపై కూడా పందికొక్కులు దాడి చేశాయి. పందికొక్కు కొరకటంతో తనకు 4 మి.మీ. గాయమైందని, తాను డయాబెటిక్ అయినందున ఈ పందికొక్కు గాటుతో తనకు వ్యాధులు అంటుకునే ప్రమాదముందని సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వచ్ఛ భారత్ గురించి మాటలు చెబుతుండగా, రైళ్ళలోని ఉన్నతశ్రేణి బోగీలనుంచికూడా రైల్వేశాఖ పందికొక్కులను నిర్మూలించలేకపోవంట సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్యానించారు. ఉన్న రైళ్ళనే శుభ్రంగా ఉంచలేని ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్స్ నడపాలని కలలు కంటోందని ఎద్దేవా చేశారు. తాము ప్రయాణించిన కంపార్ట్మెంట్ అంతా దారుణంగా ఉందని, పందికొక్కులు అటూ ఇటూ తిరుగుతున్నాయని సిన్హా ఆ లేఖలో పేర్కొన్నారు. సిన్హా బొకారో స్టీల్ ప్లాంట్‌లో పనిచేసి రిటైర్ అవగా, ఆయన భార్య అల్క రాంచిలో ఒక పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు.