రేటింగ్: 2.75/5
‘హిందోళం రీ ఉండదు… కానీ ఉందా, లేదా అన్నట్టు అలా వచ్చి ఇలా వెళ్లిపోవాలి.. అదే మ్యాజిక్` అంటాడు `కింగ్` సినిమా లో బ్రహ్మానందం. కమర్షియల్ సినిమా ప్రపంచంలో కథ కూడా అలాంటిదే. ఉండీ లేనట్టు ఉన్నా చాలు. కాకపోతే… కథనం బాగుండాలి. సినిమా అనగానే ఓ కథ ఉండాలన్నది పాత మాట. కథనం సరిగా ఉందో లేదో చూసుకుంటే చాలు…. అనేది ఈతరం దర్శకులు నమ్ముతున్న బాట. `రంగ్ దే` చూసినా అదే అనిపిస్తుంది. `అసలు ఈ సినిమాలో కథుందా` అనే డౌటు వస్తుంది. కానీ… ఆ వెంటనే కొన్ని నవ్వులు, కొన్ని ఎమోషన్లు, కమర్షియల్ జిమ్మిక్కులూ అద్దేసి – కథ లేదన్న అసంతృప్తిని తొలగిస్తూవెళ్లాడు దర్శకుడు. మరి.. ఆ ప్రయత్నం నెరవేరిందా? `రంగ్ దే`లో దర్శకుడు చూపించిన రంగులెన్ని..?
ముందే చెప్పినట్టు.. ఈ సినిమాలో కథ రేఖామాత్రమే. అది రెండు ముక్కల్లో చెప్పేసుకుంటే.. అర్జున్ (నితిన్), అను (కీర్తి సురేష్) చిన్నప్పటి నుంచీ పక్క పక్క ఇళ్లల్లో పెరుగుతారు. అను తెలివైన పిల్ల. బాగా చదువుకుంటుంది. అనుని చూసి నేర్చుకోమని.. అర్జున్ ని ఇంట్లో వాళ్లు సతాయిస్తూ ఉంటారు. అందుకే అను అంటే.. అర్జున్ కి చెప్పుకోలేని అక్కసు. ఇద్దరి మధ్యా టామ్ అండ్ జెర్రీ ఆట నడుస్తుంటుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో.. అను – అర్జున్ శారీకకంగా ఒక్కటైపోతారు. దాంతో ఇద్దరికీ పెళ్లయిపోయింది. పెళ్లయ్యాక ఈ టామ్ అండ్ జెర్రీ ఆట నడిచిందా, లేదంటే వాళ్ల మనస్తత్వాల్లో మార్పు వచ్చిందా? అనుపై అర్జున్ పై చేయి ఎప్పుడు, ఎలా సాధించగలిగాడు? అన్నదే మిగిలిన కథ.
కథ చిన్నది. దాన్ని ట్రైలర్లలోనే చెప్పేశాడు దర్శకుడు. అదీ ఒకందుకు మంచిదే అయ్యింది. `ఈ సినిమాలో ఇంతకు మించిన కథేం లేదు` అంటూ ప్రేక్షకుడు ముందే ఫిక్సయిపోయి థియేటర్లకు వస్తాడు. కొత్త కథని రాసుకోవడంలో వెంకీ అట్లూరి బద్దకించినా – సన్నివేశాల్ని మాత్రం ఫ్రెష్ గా ఉండేలా చూసుకున్నాడు. తొలి భాగంలో ఎక్కడా ఓవర్ డోస్ మెలోడ్రామాలు కనిపించవు. అనవసరమైన హీరోయిజాలకూ చోటు ఇవ్వలేదు. సరదా సరదా సన్నివేశాలతో… సినిమా నడిచిపోతుంటుంది. పాత్రల పరిచయం, అర్జున్ – అనుల మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్.. లతో ఓ టైమ్ పాస్ నోట్ తో సినిమా మొదలవుతుంది. నరేష్, బ్రహ్మాజీల కామెడీ, సింగిల్ లైనర్లు… బాగా హెల్ప్ అయ్యాయి. తొలి సగంలో ఆహా అనిపించేంత సన్నివేశాలేం లేకపోయినా – సీటు నుంచి కదలనివ్వకుండా చూసుకోగలిగాడు.
ఇంట్రవెల్ తరవాత… కామెడీ పండించే బాధ్యత వెన్నెల కిషోర్ తీసుకున్నాడు. ఓరకంగా చెప్పాలంటే సెకండాఫ్ ని తనే మోశాడు. ఇలాంటి కథల్లో ద్వితీయార్థం నుంచి ఎమోషనల్ డ్రామా మొదలవుతుంది. ఇక్కడా అదే జరిగింది. అర్జున్ – అనుల రిలేషన్ నుంచి కాన్ష్లిక్ట్ రాసుకోగలిగాడు దర్శకుడు. అయితే అది అంత బలంగా కనిపించదు. దర్శకుడు తన కోసం తనకు కన్వెనియన్స్ గా ఉండేలా ఆయా సన్నివేశాల్ని అల్లుకున్నాడనిపిస్తుంది. `ఖుషీ` కూడా లవ్ – హేట్ రిలేషన్ షిప్ తో నడిచే సినిమానే. అందులో.. ఎమోషన్ పండాల్సిన చోట.. బలమైన సన్నివేశాలు వస్తాయి. ఈ జోనర్లో ఎన్ని సినిమాలు హిట్టయినా…. దానికి కారణం ఆ ఎమోషనే. `రంగ్ దే`లో అది మిస్సయ్యింది. నిజానికి హీరో, హీరోయిన్ల మధ్య సంఘర్షణ సరగా ఉండేలా చూసుకుని, అక్కడ బలమైన సన్నివేశాల్ని రాసుకోగలిగితే… `రంగ్ దే` మరింత బాగుండేది. ఈ విషయంలో దర్శకుడి అనుభవలేమి కనిపించింది. క్లైమాక్స్ లో ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. తన ఊహలకు తగ్గట్టుగానే `శుభం` కార్డు పడేశాడు దర్శకుడు. తొలి భాగం యూత్ కోసం, రెండో భాగం ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అంటూ… సన్నివేశాల్ని కేటరింగ్ చేసుకుంటూ వెళ్లాడనిపిస్తుంది. మొత్తానికి అన్ని వర్గాలకూ నచ్చేలా `రంగ్ దే` మలచుకున్నాడు.
రొమాంటిక్ కామెడీ నితిన్‌కు అచ్చొచ్చిన జోనర్. ఇలాంటి కథలు పడినప్పుడు ఇంకా రెచ్చిపోతాడు. తన కామెడీ టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. `రంగ్ దే` విషయంలోనూ అదే జరిగింది. ఈ పాత్రని కేక్ వాక్ లా చేసుకుంటూ వెళ్లిపోయాడు నితిన్. తనకు కీర్తి సురేష్ మరింత బలంగా నిలిచింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక ముందు ఈ జంటని మరిన్ని సినిమాల్లో చూడాలి అనిపించేలా.. అలరించారిద్దరూ. నరేష్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ.. ఇలా కామెడీ గ్యాంగ్ అంతా తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు.
ప్రేమ కథలొచ్చినప్పుడు దేవి శ్రీ మరింత మంచి సంగీతం అందిస్తుంటాడు. అయితే `రంగ్ దే` విషయంలో ఏదో లోటు చేశాడనిపిస్తుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేంత మంచి పాటలైతే ఈ సినిమాలో లేవు. `ఏమిటో ఇది..` పాటొక్కటే ఇందుకు మినహాయింపు. పిసీ శ్రీరామ్ కెమెరా.. కొత్త పుంతల్ని తొక్కింది. తన ఫ్రేములో… ఈ రొటీన్ కథ అందంగా, ఆకర్షణీయంగా కనిపించింది. రచయితగా కథ విషయంలో నిరుత్సాహ పరిచిన వెంకీ.. దర్శకుడిగా పాస్ అయిపోయాడు. సరదా సన్నివేశాలతో మ్యాజిక్ చేశాడు. ఓ లవ్ స్టోరీకి ఏం కావాలో అవి ఇచ్చేశాడు. ప్రేమకథలకు కావల్సిన సంఘర్షణ విషయంలో.. వెంకీ ఇంకాస్త దృష్టి పెడితే, తన నుంచి మరిన్ని మంచి సినిమాలు ఆశించొచ్చు.
మొత్తంగా చూస్తే.. రంగ్ దే టైమ్ పాస్ సినిమా. యూత్ బాగా కనెక్ట్ అవ్వొచ్చు. నితిన్ – కీర్తిల జోడీ, మంచి కెమెరా పనితనం, రోత పుట్టించని కామెడీ సన్నివేశాలు.. `రంగ్ దే`కి కొత్త రంగులు అద్దాయి. మరీ ఎక్కువ ఆశించకుండా థియేటర్లలో కూర్చుంటే.. `శుభం` కార్డు పడేంత వరకూ.. కావల్సినంత కాలక్షేపం దొరికేస్తుంది.
ఫినిషింగ్ టచ్: రొటీన్ కథకు కొత్త రంగు
రేటింగ్: 2.75/5