రొమాంటిక్ కామెడీ చిత్రాలకు భలే డిమాండ్ ఉంది. యువతరాన్నిథియేటర్లకు రప్పించే జోనర్ అది. హిట్టయితే.. పండగే పండగ. నితిన్‌కి ఈ జోనర్ బాగా అచ్చొచ్చింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, భీష్మ.. ఇలాంటి కథలే. ఇప్పుడు `రంగ్ దే`తో ఆ జోనర్ మళ్లీ ఎంచుకున్నాడు. నితిన్ కి కీర్తి సురేష్ తోడైందిప్పుడు. వీళ్ల కెమిస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయినట్టు అనిపిస్తోంది. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
అర్జున్ – అనుల కథ ఇది. చిన్నప్పటి నుంచీ… అర్జున్ ని తొక్కేసే స్నేహితురాలి పాత్రలో అను కనిపిస్తోంది. అర్జున్ చదువులో..వీక్, అను.. చదువులో ఫస్ట్. అనుపై పైచేయి సాధించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. అంతగా ద్వేషించే.. అనుని అర్జున్ పెళ్లి కూడా చేసుకోవాల్సివస్తోంది. ఆ తరవాత ఏమైందన్నదే కథ. ట్రైలర్ లోనే ఫన్, రొమాన్స్, టామ్ అండ్ జెర్రీ ఆటలూ… బాగా కనిపిస్తున్నాయి. ఫన్, రొమాన్స్ ఇవి రెండూ వర్కవుట్ అయితే… నితిన్ కి మరో హిట్టు దక్కినట్టే. క్లైమాక్స్ లో కావల్సినంత ఎమోషన్ కూడా మేళవించినట్టు కనిపిస్తోంది. తొలి ప్రేమలో దర్శకుడు వెంకీ అట్లూరి ఎంచుకున్న ఫార్మెట్ కూడా ఇదే. మరోసారి అదే జోనర్లో హిట్టు కొడతాడేమో చూడాలి. వెన్నెల కిషోర్ కామెడీ, దేవిశ్రీ సంగీతం, కలర్‌ఫుల్ ఫొటోగ్రఫీ.. ఈ సినిమాకి మరిన్ని అదనపు ఆకర్షణలు అద్దుతున్నాయి. వచ్చేవారం కూడా మూడు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మిగిలిన రెండు సినిమాలకు రంగ్‌దే గట్టి పోటీనే ఇవ్వబోతోందని ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది.