Ranga Ranga Vaibhavanga movie review
తెలుగు360 రేటింగ్ : 2.25/5
తొలి సినిమా ‘ఉప్పెన’తో పెద్ద విజయం సాధించి మెగా ఎంట్రీ ఇచ్చాడువైష్ణవ్ తేజ్. క్రిష్ తో చేసిన కొండపొలం సరిగా ఆడలేదు. కాకపోతే… సిన్సియర్నటుడనిపించుకున్నాడు. ఇప్పుడు మూడో చిత్రంగా ‘రంగ రంగ వైభవంగా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గిరీశాయ ఈ చిత్రానికి దర్శకుడు.అర్జున్ రెడ్డి, మహానటి చిత్రాలకు కో డైరెక్టర్ గా పని చేసిన గిరీశాయ..అర్జున్ రెడ్డిని తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ చేశాడు. ఇప్పుడు తన రెండో సినిమాగా ‘రంగ రంగ వైభవంగా’ని తెరకెక్కించాడు. మరి టైటిల్ లో వున్న వైభవం సినిమాలో ఉందా, లేదా? తెలుసుకొంటే..
రిషి( వైష్ణవ్ తేజ్) రాధ (కేతిక శర్మ) బాల్య స్నేహితులు. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిషి తండ్రి చంటి (నరేష్) రాధ తండ్రి రాముడు (ప్రభు) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. పక్కపక్కన ఇల్లు కట్టుకొని కలసిమెలసి ఉంటారు.రిషి, రాధ స్కూలు రోజుల్లో జరిగిన చిన్న గొడవలో విడిపోతారు. అప్పటి నుండి వారి మధ్య మాటలు లేకుండా పోతాయి. మాటలు వుండవు కానీ ప్రేమ మాత్రం వుంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం. పెరిగిపెద్దయ్యాక ఇద్దరూ మెడిసిన్ లో చేరుతారు. అనుకోని ఒక సంఘటన వలన రాధ రిషి మళ్ళీ మాట్లాడుతారు. తమ ప్రేమని చెప్పుకుంటారు. ఇదే సమయంలో రాధ అన్నయ అర్జున్ (నవీన్ చంద్ర) రాజకీయాల్లో యూత్ లీడర్ గా ఎదుగుతుంటాడు. తన పెద్ద చెల్లికి మినిస్టర్ (నాగబాబు) కొడుకు సంబంధం తీసుకొస్తాడు. అయితే ఆ సంబంధంని అర్జున్ చెల్లి రిజెక్ట్ చేస్తుంది. దీనికి కారణం.. అర్జున్ చెల్లి, రిషి వాళ్ళ ఆన్నయ్యతో ప్రేమలో వుంటుంది. ఈ సంగతి అర్జున్ కి తెలీదు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని వాడు సమాజాన్ని ఏం ఉద్దరిస్తాడు ? అని అర్జున్ పరువు తీసేస్తాడు మినిస్టర్. ఈ అవమానంతో రగిలిపోయిన అర్జున్ ఏం చేశాడు ? రెండు కుటుంబాల మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? చివరికి రిషి, రాధ ప్రేమ గెలిచిందా ? లేదా ? అనేది మిగతా కథ.కథలో కొత్తదనం లేనప్పుడు ట్రీట్మెంట్ కొత్తగా వుండాలి. రెండు గంటలు పాటు ప్రేక్షకుడిని యంగేజ్ చేసే కథనం రాసుకోవాలి. అప్పుడే పాత కథ పాస్అవుతుంది. ‘రంగ రంగ వైభవంగా’ కోసం దర్శకుడు ఒక పాత ఫార్ములా కథని తీసుకున్నాడు. దురదృష్టం ఏమిటంటే.. ఆ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా పాతదే.
నిన్నే పెళ్లాడతా సినిమా విడుదలైన రోజు ఈ కథ మొదలౌతుంది. ఆ సినిమాలానే రెండు కుటుంబాలని ఎస్టాబ్లెస్ చేసి నాగార్జున, టబు టైపులో రిషి, రాధ ట్రాక్ ని నడపాలనే ప్రయత్నం జరిగింది. అయితే ఆ కెమిస్ట్రీ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ఇదే కథలో నువ్వే కావాలి, నువ్వు లేక నేను ట్రీట్మెంట్ ని కూడా వాడేశాడు. కానీ లాభం లేదు. ఖుషి రిఫరెన్స్ మొదలుకొని ఇందులో వచ్చే అనేక సన్నివేశాలు ఏవో పాత సినిమాలని గుర్తు చేస్తూనే వుంటాయి. నిజానికి ఈ కథని సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పినప్పుడే.. `ఇది పాత సినిమా కదా` అని ఫీలింగ్ నిర్మాతకో, హీరోకో వచ్చి ఉండాలి. కాకపోతే… దర్శకుడు ఈ పాత కథని కొత్తగా చెబుతాడని నమ్మి ఉంటారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు దర్శకుడు. తొలి సగంలో.. అక్కడక్కడా ఫన్ పండి.. ఓకే అనిపిస్తుంది కానీ, రాను రాను.. మొనాటినీ ఎక్కువై, బలవంతపు డ్రామా పెరిగి పెరిగి.. ప్రేక్షకులకు నీరసం తెప్పించింది.
అర్జున్ పాత్ర రూపంలో ఈ కథకి పొలిటికల్ టచ్ ఇచ్చిన దర్శకుడు ఆఖరికి దాన్ని కూడా సరిగ్గా డీల్ చేయలేకపోయాడు. అసలు ఆ ట్రాక్ అనవసరం అనిపిస్తుంది. ఇలాంటి కథకు అది అస్సలు నప్పలేదు. సినిమా మొదటి నుంచి ప్రేక్షకుడి ఊహకు అందిపోతుంటుంది. తర్వాత వచ్చే మూడు సీన్లు కూడా తెలిసిపోతుంటాయి. రిషి, రాధ ఈగో క్లాష్ తో ఇంటర్వెల్ వరకూ లాక్కొచ్చి దర్శకుడు .. ఇక సెకండ్ హాఫ్ కి చేతులెత్తేశాడు. సెకండ్ హాఫ్ మెడికల్ క్యాంపు తో మొదలుపెట్టిన తీరు చూశాక .. ఇక ఈ సినిమాలో చెప్పడానికి విషయం ఏమీ లేదనే సంగతి అర్ధమైపొతుంది. రెండు కుటుంబాలని కలపడానికి హీరో హీరోయిన్ చేసే ప్రయత్నాలు బోర్ కొడతాయి. నిజానికి ఇంటర్వెల్ లో రెండు కుటుంబాలు విడిపోయినపుడు కథలో ఒక సంఘర్షణ వస్తుంది. విచిత్రం ఏమిటంటే.. ఈ సంఘర్షణని పాత్రధారులే లైట్ తీసుకుంటారు. దాదాపు సన్నివేశాలన్నీ తేలిపోతుంటాయి. ఇక కథని ముగించాలి కాబట్టి.. హీరో చాలా గొప్పోడని చెప్పి.. మరింత రొటీన్ గా ఈ కథకి పలికారు. ఈ సినిమా టైటిల్ కి జస్టిఫీకేషన్ ఏమిటంటే.. చివర్లో వచ్చే పాట అనుకోని థియేటర్ నుంచి బయటికి అడుగుపెతడాడు ప్రేక్షకుడు.
వైష్ణవ్ తేజ్ తన పాత్రని డీసెంట్ చేశాడు. కామెడీ సీన్స్ మంచి ఈజ్ తో చేశాడు. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ లా మాట్లాడాలని ప్రయత్నించాడు. ఐతే అది అంతగా కుదరలేదు. కేతిక క్యూట్ గా వుంది. సాంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపించింది. నరేష్, ప్రభుల అనుభవాన్ని వాడుకోలేకపోయాడు దర్శకుడు.ఇద్దరి పాత్రలని ఇంకా బలంగా తీర్చిదిద్దే అవకాశం వుంది. నవీన్ చంద్ర కథలో కీలకమే కానీ ఆ పాత్రని తీర్చిదిద్దంలో దర్శకుడు మరింత శ్రద్ద పెట్టాల్సింది. సత్యది చిన్న పాత్రే. కానీ ఆ పాత్ర నవ్వుల్నీ పంచింది.అమ్మా చూడాలి పాటని మూడు యాసల్లో పాడిన విధానం నవ్విస్తుంది. మిగతా నటులు పరిధిమేర చేశారు.
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాని కలిసొచ్చింది. రెండు పాటలు వినడానికి, చూడటానికి బావున్నాయి. నేపధ్య సంగీతంలో కూడా తన అనుభవాన్ని చూపించాడు. కెమెరాపనితనం డీసెంట్ గా వుంది. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. కథ కావాల్సింది సమకూర్చారు. ఒక ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తీయాలనుకున్నాడు గిరీశాయ. రెండు కుటుంబాలు, ఒక లవ్ స్టొరీ .. ఈ సెటప్ అంతా ఓకే. కాకపొతే తీసిన విధానమే పాతది.
ఫినిషింగ్ టచ్ : రంగ రంగ సాధారణంగా..
తెలుగు360 రేటింగ్ : 2.25/5