Rangabali Review
Rangabali Review
Telugu360 Rating : 2.25/5
రంగబలి’పై నాగశౌర్య నమ్మకం చూస్తే ముచ్చటేసింది. ‘నాకు ఈ సినిమా నుంచి హిట్ కాదు.. బ్లాక్ బస్టరే కావాలి` అన్నాడు. అక్కడితో ఆగలేదు. ఇప్పటివరూ ఏ సినిమా తీసుకురాని లాభాల్ని రంగబలి.. నిర్మాతలకు తెస్తుందని ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కొత్త దర్శకుడితో చేసిన సినిమాపై ఇంత నమ్మకం, ఆశలు పెట్టుకోవడం అంటే కంటెంట్ పై ఎంతో కాన్ఫిడెన్స్ వుండాలి. మరి నాగశౌర్యతో ఇంత నమ్మకంగా మాట్లాడించిన ‘రంగబలి’ కథ ఏమిటి? శౌర్య నమ్ముకున్న విజయం దక్కిందా ?
శౌర్య అలియాస్ షో (నాగశౌర్య)ది రాజవరం. చిన్నప్పటి నుంచి శౌర్యది భలే బడాయి, డాబు క్యారెక్టర్. అన్నిట్లో షోయింగ్ ఎక్కువ. శౌర్య తండ్రి ఆ వూర్లోని రంగబలి సెంటర్ లో మెడికల్ షాప్ నడుపుతుంటాడు. స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరగడం, హంగామా చేయడం ఇదే శౌర్య దినచర్య. శౌర్యకి సొంత ఊరు అంటే ఎక్కడిలేని ప్రేమ. తన బలం అదే. ఎలాంటి పరిస్థితిలో కూడా ఊరు దాటి వెళ్లకూడదని చిన్నప్పుడే డిసైడైపోతాడు. శౌర్య బలాదూర్ తిరుగుళ్ళు భరించలేని తండ్రి వైజాగ్ లోని ఓ మెడికల్ కాలేజ్ లో ఫార్మాసీ కోర్స్ లాంటింది చేసిరమ్మని పంపిస్తాడు. ఓ నాలుగు నెలలు అక్కడి గడిపి వచ్చేస్తే ఇక ఊర్లో మందుల షాపులోనే సెటిల్ అయిపోవచ్చని వైజాగ్ బస్ ఎక్కేస్తాడు శౌర్య. వైజాగ్ మెడికల్ కాలేజ్ లో సహజ (యుక్తి తరేజ్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. సహజ తండ్రి ( మురళి శర్మ) ప్రేమకి అంగీకారం కూడా తెలుపుతాడు. ఐతే సరిగ్గా ఇక్కడే శౌర్య ప్రేమకు ‘రంగబలి’ సెంటర్ ఓ సవాల్ గా మారుతుంది. శౌర్య ది రాజవరం రంగబలి సెంటర్ అని తెలుసుకున్న సహజ తండ్రి .. వారి ప్రేమకు రెడ్ సిగ్నల్ వేస్తాడు. తన కూతురిని పెళ్లి చేసుకోవాలంటే రాజవరంలో కాకుండా వైజాగ్ లో సెటిల్ అవ్వాలని కండీషన్ పెడతాడు. అసలు రంగబలి సెంటర్ పేరు వినగానే సహజ తండ్రి అలా ఎందుకు మారిపోయాడు? తన ప్రేమని గెలిపించుకోవడం కోసం శౌర్య ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు రంగబలి సెంటర్ కి ఆ పేరు ఎలా వచ్చింది? అనేది మిగతా కథ.
సన్నివేశాల్లో వినోదం ఉండాలే కానీ కథ గురించి ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడనే వాదన ఒకటి ఉంది. ఆ వాదనకు అద్దం పడుతుంది రంగబలి ఫస్ట్ హాఫ్. అవును.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో అసలు కథే లేదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. హీరోని ‘షో’ గా పరిచయం చేయడం, స్నేహితుల గ్యాంగ్, రంగబలి సెంటర్, తండ్రి మెడికల్ షాపు.. శౌర్య వైజాగ్ రావడం, అక్కడ హీరోయిన్ తో ప్రేమ.. ఇవన్నీ సరదా సరదాగా గడిచిపోతాయి. ముఖ్యంగా అగాధం పాత్రలో సత్య.. దాదాపుగా ఇందులో సెకండ్ హీరో అవతారం ఎత్తేశాడు. ఈ మధ్య కాలంలో ఓ క్యారెక్టర్ తో ఇంత కామెడీ పండిన మరో సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఎదుటివాడు అనందంగా వుంటే చూడలేని ఆ పాత్రని సత్య చేసిన తీరు హిలేరియస్. తను కనిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నవ్వొచ్చేస్తుంది. మంచి ఫామ్ లో వున్న బ్యాట్స్ మెన్ టచ్ చేసిన ప్రతీ బంతీ బౌండరీ దాటేసినట్లు..కెమరాముందు సత్య కనిపిస్తే చాలు పెదవిపై నవ్వు విచ్చుకుంటుంది. అంత చక్కగా పండిపోయింది ఆ పాత్ర. సత్య చేసిన సందడితో అసలు ఇందులో కథ ఏమిటనే సంగతి కూడా ప్రేక్షకుడికి పట్టదు.
ఐతే లేటుగా కథలోకి వెళ్లినా మంచి పాయింట్ నే పట్టుకున్నాడు దర్శకుడు. ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన హీరో పాత్రలని చూశాం. కానీ ఇందులో హీరోకి ఎదురైన సవాల్ మాత్రం ఎవరికీ ఎదురైవుండదు. తన ప్రేమ గెలవాలంటే రంగబలి సెంటర్ పేరు మార్చాలి. ఇలా పేరు మార్చడం కూడా ఒక సమస్యేనా అని సింపుల్ గా తీసుకున్న హీరోకి అది ఎంత కష్టమో నెక్స్ట్ సీన్ లోనే తెలిసిపోతుంది. అక్కడ మొదలౌతుంది అసలు సంఘర్షణ. పేరు మార్చడానికి హీరో చేసిన బాంబ్ ప్రయత్నం ఐతే నిజంగా బాంబ్ లానే పేలుతుంది. అక్కడ సత్యనే మళ్ళీ మార్కులు కొట్టేస్తాడు.
ఐతే కథ పరంగా కొత్త సంఘర్షణనే ఎంచుకున్న దర్శకుడు దానిని ముందుకు నడపడంలో వెనకడుగువేశాడు. ఎప్పుడైతే ఈ కథ పట్టాలెక్కుతుందో బండి ముందుకి కదలడానికి గ్రీన్ సిగ్నల్ దొరకదు. రంగారెడ్డి రూపంలో శరత్ కుమార్ ట్రాక్ అంతగా మెప్పించలేదు. సెకండ్ హాఫ్ లో రంగబలి గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోతుంది. ఈ కథని ఎటు తీసుకువెళ్ళాలో దర్శకుడి అర్ధం కాలేదనే సంగతి చూస్తున్న ప్రేక్షకుడికి అర్ధమౌతుంది.
నిజంగా ఒక దశలో అయోమయంలో పడిపోయాడు దర్శకుడు. మూల కథనే లాజిక్ లెస్ గా మార్చేశాడు. ఈ కథపై ఎంతలా పట్టు జారవిడుచుకున్నాడంటే రంగారెడ్డి కథలోకి శౌర్యని తీసుకొచ్చాడు. దీని కోసం దర్శకుడు వేసుకున్న సన్నివేశం అసలు క్లూ లెస్ గా వుంటుంది. ఎలా అంటే .. ఒక జంక్షన్ దగ్గర రంగారెడ్డి ఫైట్ చేస్తుంటాడు. చిన్నప్పటి శౌర్య అక్కడికి సైకిల్ మీద వస్తాడు. ఓ గుర్రం విగ్రహం పడబోతుండగా శౌర్యని కాపాడబోయిన రంగారెడ్డి .. రౌడీల కత్తికి బలైపోతాడు. ఈ కథ శుభలేఖ సుధాకర్ పాత్ర శౌర్యతో చెబుతుంది. ఇందులో ఎన్ని దోషాలు ఉన్నాయంటే.. చిన్నప్పటి శౌర్య అక్కడికి వచ్చాడని శుభలేఖ సుధాకర్ పాత్రకి తెలీదు. చెప్పడానికి రంగారెడ్డి లేడు. అదిపక్కన పెడితే.. సైకిల్ నడిపే వయసు వున్న పిల్లాడు కళ్ళ ముందు అంత పెద్ద సీన్ జరుగుతుంటే దాన్ని మర్చిపోవడం అంటూ వుండదు. దాన్ని మరో పాత్ర గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఇదంతా ఏం చేయాలో తెలియక అల్లుకున్న సన్నివేశాలుగానే మిగిలిపోతాయి. వినోదాన్ని నడపడంలో ఎంతో ఈజ్ చూపించారో అసలు కథని డీల్ చేయడంలో అంతే తడబడిపోయాడు దర్శకుడు.
ఇక ఈ కథ కు ముగింపు కూడా చాలా బలహీనంగా వుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంత పేలవమైన క్లైమాక్స్ మరో సినిమాలో కనిపించలేదు. మీడియాని రంగంలోకి దించి ప్రజలు చెడునే ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని క్లాస్ పీకి చివర్లో విలన్ పాత్రగా కనిపించిన పరశురాం పాత్రని కోరలు తీసిన పాములా హాస్పిటల్ బెడ్ మీద కూర్చోబెట్టి నచ్చినట్లు ఎండింగ్ కార్డు వేసుకున్నారు తప్పితే కథకి ఒక మంచి ముగింపు ఇవ్వలేకపోయారు. నిజానికి ఆ రంగబలి పేరు మార్పు సంఘర్షణని కాస్త తెలివిగా సృజనతో డీల్ చేసుంటే ఇది మంచి సినిమా అయ్యేది. కానీ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.
నాగశౌర్య స్క్రీన్ ప్రజన్స్ చాలా బావుంది. తన ఫిజిక్ పై వున్న శ్రద్ధని మెచ్చుకోవాలి. మంచి ఫిజిక్ ని మెంటైన్ చేయడంతో సింపుల్ అవుట్ ఫిట్స్ లో కూడా చాలా అందంగా కనిపించాడు. తన టైమింగ్ బావుంది. యాక్షన్ సీన్స్ లో కూడా బాగా చేశాడు. ఓ హిట్ కొట్టాలన్న తపన బాగా కనిపించింది. `ఇమాజినేషన్` సీన్లో తన ఈజ్ చూస్తే మరింత ముచ్చటేస్తుంది. యుక్తి తరేజ్ అందంగా వుంది. ఒక పాటలో గ్లామర్ డోస్ శృతి మించింది. అది హీరో ఇమాజినేషన్ అయినప్పటికీ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో రామ్ గోపాల్ వర్మ రంగీలా టైపు పిక్చరైజేషన్ పంటికింద రాయిలా తగులుతుంది. ముందే చెప్పినట్లు సత్య ఇందులో సెకండ్ హీరో. తను కనిపించినప్పుడల్లా చాలా రిలీఫ్ గా వుంటుంది. అలాగే రాజ్ కుమార్ టైలర్ గా నవ్వించాడు. షైన్ టామ్ చాకో పాత్రని సరిగ్గా రాసుకోలేదు. చివర్లో ఆ పాత్ర గాలి తీసేశారు. శరత్ కుమార్ కనిపించింది కాసేపైన తన ప్రజన్స్ బావుంటుంది. గోపరాజు రమణ మరోసారి ఆకట్టుకున్నారు. గీత రచయిత అనంత శ్రీరామ్ ఇందులో ఓ పాత్ర చేశారు. మురళి శర్మ పాత్ర గెస్ట్ రోల్ లా వుంటుంది.
పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం లైవ్లీగా వుంది. కెమెరాపనితనం ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు రాసుకొన్న డైలాగ్స్ లో కొన్ని భలే పేలాయి. కామెడీపై మంచి పట్టున్న దర్శకుడనిపించాడు. కథ నడపడంలో కూడా అదే నేర్పు చూపించివుంటే బావుండేది. అయితే `అతుల్` పేరు చుట్టూ నడిపిన కామెడీ మాత్రం నాశిరకంగా అనిపిస్తుంది.
క్రికెట్ లో కొన్ని సార్లు ఓపెనర్స్ మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్ వైపు బాటలు వేసినట్లు కనిపిస్తారు. కానీ ఒక వికెట్ పడ్డాక అనూహ్యంగా మిడిల్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోయి ఏ వందో నూట యాభై పరుగులకే సర్దుకోవడం చూస్తుంటాం. రంగబలి చూస్తున్నపుడు కూడా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఆరంభంలోని నవ్వులు, జోష్ చూసి మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ అనుకునే లోపలే సెకండ్ హాఫ్ పేకమేడలా కూలిపోయింది
Telugu360 Rating: 2.25/5