సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న కుర్రాడు. పండగైనా, పాడైనా అంతా ఇక్కడే అనుకొనే అక్కడే అనుకొంటాడు. అలాంటోడికి ఎలాంటి సమస్యలు, ప్రతిబంధకాలూ ఎదురయ్యాయి అనేదే ‘రంగబలి’ కథ. నాగశౌర్య హీరోగా నటించిన చిత్రమిది. జులై 7న వస్తోంది. ఈ లోగా ట్రైలర్ విడుదల చేశారు.
”ప్రతి మనిషి పేరు మీద సొంత పొలం ఉండకపోవొచ్చు. సొంత ఇల్లు ఉండకపోవొచ్చు. కానీ సొంత ఊరు మాత్రం ఉంటుంది..”
”బయటి ఊర్లో బాసినసలా బతికినా తప్పు లేదు భయ్యా.. కానీ సొంతూర్లో మాత్రం సింహంలా ఉండాలి”
అంటూ నాగశౌర్య చెప్పిన ఈ డైలాగుల్లోనే ఈ కథ జిస్ట్ మొత్తం చెప్పేశాడు దర్శకుడు. ఇందులో నాగశౌర్య క్యారెక్టరైజేషన్ కూడా అల్లరి అల్లరిగానే ఉంటుంది. సొంత షాపు నుంచే దొంగతనం చేయడం, ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడం, అమ్మాయిల వెంట పడడం… ఇలా ఫన్నీ ఫన్నీగా డిజైన్ చేశారు. దానికి తోడు సత్య క్యారెక్టర్ కూడా నవ్వులు పంచుతోంది. ‘విక్కీ డోనర్’ స్ఫూర్తిగా స్పెర్మ్ డోనర్ అవతారం ఎత్తాలనుకొన్న సత్య చెప్పిన డైలాగులు కొన్ని నవ్విస్తున్నాయి.
ఆ తరవాత కథ సీరియస్ టోన్లోకి దిగింది. విలన్ రంగ ప్రవేశం.. రంగ బలి సెంటర్ నేపథ్యం, అక్కడి రాజకీయంతో వాడీ వేడీగా మారింది. యాక్షన్ సీన్లు కూడా ఈ సినిమాలో దండిగానే ఉన్నాయన్న సంగతి అర్థమవుతున్నాయి. చివర్లో పంచ్ అయితే.. ఫన్నీగా బాగుంది. మొత్తానికి ఓ ప్రామిసింగ్ సినిమా చూడబోతున్నామన్న భరోసా ‘రంగబలి’ ట్రైలర్ ఇచ్చేసింది. నాగశౌర్య క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్… ఇవన్నీ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. శౌర్య ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర బాగా ఆడాయి. ఆ లక్షణాలు ‘రంగబలి’లో ఉన్నాయి.