సినిమాటోగ్రాఫర్లుగా రాణించిన వాళ్లు, దర్శకులుగా మారడం చూస్తూనే ఉంటాం. కెమెరామెన్ అంటే.. సగం డైరెక్టర్! అతని ఆలోచనలు ఒక్కోసారి దర్శకుడి ఆలోచనలకంటే వేగంగా, పదునుగా ఉంటాయి. కెమెరామెన్ సరిగా ఉంటే, కో డైరెక్టర్ సహాయంతోనైనా సినిమా తీసేయొచ్చు. సినిమాపై వాళ్లకు అంత పట్టుంటుంది. అందుకే కెమెరామెన్లు దర్శకులుగా మారుతుంటారు. కె.వి.ఆనంద్ కూడా అలానే దర్శకుడయ్యారు.
అయితే… అందరూ వేరు… కెవి ఆనంద్ వేరు. తొలి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్న ఛాయాగ్రహకుడాయన. బడా బడా హీరోల సినిమాలకు పనిచేశారు. కెవి ఆనంద్ బిజీగా ఉన్నారంటే, ఆయన ఖాళీ అయ్యేంత వరకూ సినిమాని పోస్ట్ పోన్ చేసిన హీరోలున్నారు. అదీ.. కెవి పనితనం. అలాంటి బిజీ కెమెరామెన్, అంత డిమాండ్ ఉన్న కెమెరామెన్.. దర్శకత్వం వైపు అడుగు వేయడం సాహసం. కానీ… కొన్ని కథలు తానే చెప్పాలనుకుని – రంగంలోకి దిగారు. దర్శకుడిగా కెవి చేసిన సినిమాలు ఐదారుంటాయంతే. కానీ అందులో `రంగం` ఓ ఆణిముత్యం.
రంగంలో స్టార్లెవరూ లేరు. కెవి ఆనంద్ అనుకుంటే ఈ సినిమాని స్టార్లతో నింపేద్దుడు. కథే.. స్టార్ అనుకున్నాడు. తమిళంలో `కో` పేరుతో విడుదలై.. తెలుగులో `రంగం`గా అనువాదమైంది ఈ సినిమా. జీవాతెలుగులో కొట్టిన ఏకైక హిట్ అది. పొలిటికల్ డ్రామాని అంత గ్రిప్పింగా తీయడం, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్, ఆ కథని ముగించే పద్ధతి.. సింప్లీ సూపర్బ్. కథకుడిగా కెవి ఆనంద్ ఎంత విషయమున్నవాడో.. రంగం నిరూపించింది. నిజానికి `కో` కథ చేస్తున్నప్పుడు చాలామంది హీరోలు ఈ సినిమా మేం చేస్తాం.. అని ముందుకు వచ్చారు. సూర్య, అజిత్, శింభు.. వీళ్లంతా జీవా పాత్ర కోసం రెడీ అయ్యారు. కానీ… ఆనంద్ మాత్రం ఏరి కోరి జీవాని ఎంచుకున్నాడు. ఆ సినిమా ఇప్పటికీ… ప్రేక్షక లోకాన్ని అలరిస్తూనే ఉంది. అయన్, మాత్రన్, అనేగన్… ఇలా ఏ కథ తీసుకున్నా.. అందులో ఏదో ఓ ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాడు ఆనంద్. అయితే.. క్రమంగా కమర్షియాలిటీ వైపు మనసు లాగడం, భారీ బడ్జెట్లతోరిస్క్ చేయాలనిపించకపోవడంతో… కెవి ఆనంద్ మార్క్ మిస్సయ్యింది. అదే పరాజయాల్ని తెచ్చి పెట్టింది.
కానీ ప్రతి దర్శకుడి కెరీర్లోనూ ఎలాంటి సినిమా ఉండాలనుకుంటాడో అలాంటి సినిమా.. తన రెండో ప్రయత్నంలోనే సాధించేశాడు ఆనంద్. దర్శకుడిగా ఆయన పేరు గుర్తుకురాగానే.. `రంగం`ని తలచుకున్నామంటే.. అది ఆయన సంపాదించుకున్న ఆస్తి. మరికొన్నాళ్లు ఉండాల్సిన వ్యక్తి. ఉండుంటే.. కచ్చితంగా `రంగం`ని మరిపించే సినిమాలు తీద్దురు. కొత్త కథలు చూపిద్దురు.