ఓ సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షో వేయడానికి గట్స్ ఉండాలి. అలాంటిది సెన్సార్ కూడా జరక్కుండానే… `రంగమార్తండ` ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు కృష్ణవంశీ. దాన్ని బట్టి ఈ సినిమాని కృష్ణవంశీ ఎంత ప్రేమించాడో, తనపై తాను ఎంత నమ్మకం ఉంచుకొన్నాడో అర్థం అవుతోంది. మరాఠీలో `క్లాసిక్` అనిపించుకొన్న `నటసామ్రాట్`కి ఇది రీమేక్. నిజానికి… ఇలాంటి సినిమా ముట్టుకోవడమే అతి పెద్ద సాహసం. `నటసామ్రాట్`లో కథ, కథనం కంటే… పెర్ఫార్మ్సెన్సులు బలంగా ఉంటాయి. నానా పటేకర్ తో సహా.. ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగులు ఇచ్చేశారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలంటే.. కృష్ణవంశీకి కత్తిమీద సాములాంటి వ్యవహారం. నానా పటేకర్ లాంటి నటులకు ప్రత్యామ్నాయం ఎంచుకోవాలి… నట సామ్రాట్ స్థాయిని అందుకోవాలి.. ఇలా సవాళ్లపై సవాళ్లు. అందుకే `రంగమార్తాండ`ని కృష్ణవంశీ ఎలా తీశాడు? అందుకోసం ఏం చేశాడన్న ఆసక్తి నెలకొంది.
గురువారం రాత్రి… రంగమార్తండ ప్రీమియర్ షో జరిగింది. దాదాపు వంద మందికి `రంగమార్తండ` చూసే అవకాశం దక్కింది. ఈ షో చూసిన వాళ్లంతా సినిమా అయిపోయాక భావోద్వేగాలకు గురయ్యారు. వాళ్లందరి నోటా.. ఒకటే మాట.. `కృష్ణవంశీ ఈజ్ బ్యాక్` అని. `నట సామ్రాట్`లోని సోల్ ఎక్కడా మిస్ అవ్వకుండానే.. కృష్ణవంశీ తనదైన టచ్ ఇచ్చే ప్రయత్నం చేశారిందులో. ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం, రమ్యకృష్ణ.. వీళ్ల నటన చూస్తే `ఇందుకు కాదూ… యాక్టర్లంతా కృష్ణవంశీతో సినిమా చేయాలని ఎదురు చూసేది..` అనిపించకమానదు. ప్రకాష్ రాజ్ సంగతి సరే. ఆయన ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్. ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేం లేదు. కానీ… ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ సర్ప్రైజింగ్ ప్యాకేజ్. చక్రి అనే పాత్రలో నటించిన బ్రహ్మానందం… తన కెరీర్‌లోని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తరవాత.. దర్శకులు, రచయితలు బ్రహ్మానందంని చూసే కోణం మారిపోవడం ఖాయం. ఆ స్థాయిలో ఉంది ఆ నటన. ముఖ్యంగా ఆసుపత్రి సీన్ లో బ్రహ్మానందం ప్రకాష్‌రాజ్‌ని పూర్తిగా డామినేట్ చేసేశాడు. భార్యాభర్తల అనుబంధాన్ని కృష్ణవంశీ ఆవిష్కరించిన విధానానికీ మంచి మార్కులు పడతాయి. తన భార్యని భర్త `రాజుగారూ..` అని పిలుస్తూ సేవలు చేయడం – చూడముచ్చటి దృశ్యం. పతాక సన్నివేశాలలకు ముందు.. రమ్యకృష్ణ నటన, క్లైమాక్స్‌లో.. ప్రకాష్ రాజ్ విజృంభించిన విధానం… అన్నింటికి మించి ఇళయరాజా అందించిన పాటలు, నేపథ్య సంగీతం.. రంగమార్తాండకి మెరుపులు అద్దాయి. మధ్యలో తెలుగు భాష గురించీ, మన నాటకాల గురించీ చెప్పే అవకాశం వచ్చినప్పుడు.. సమాజాన్నీ, ప్రేక్షకుల్నీ ప్రశ్నిస్తాడు దర్శకుడు. బిడ్డల్ని అతిగా ప్రేమించే అమ్మానాన్నలకు హెచ్చరికలు జారీ చేస్తాడు.
మొత్తానికి కృష్ణవంశీ చాలా కాలం తరవాత తనదైన సినిమా తీశాడు. ప్రేక్షకులతో భావోద్వేగాల ప్రయాణం చేయించడానికి సిద్ధమయ్యాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మంచి సినిమాలకు కచ్చితంగా ఆదరణ ఉంటుందనుకోవడం నిజమైతే.. రంగమార్తాండకీ ఆ తరహా గుర్తింపు దక్కడం ఖాయమన్నది సినీ జనాల మాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
(పూర్తి రివ్యూ త్వరలో)