సుకుమార్ – దేవిశ్రీ కాంబినేషన్ అంటే… ఐటెమ్ సాంగ్ అదిరిపోవాల్సిందే. అ.. అంటే అమలాపురం దగ్గర్నుంచి రింగ రింగ వరకూ… వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతీ ఐటెమ్ పాటా హిట్టే. ప్రత్యేక గీతాల్లో అవన్నీ ట్రెండ్ సృష్టించాయి. రంగస్థలంలోనూ ఐటెమ్ పాట ఉంది. అందులో పూజా హెగ్డే కనిపించబోతోందనే సరికి ఈ పాటపై ఆశలు, అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఇప్పటి వరకూ విడుదల చేసిన మూడు పాటలూ ఓ రేంజులో ఉండడంతో జిగేల్ రాణి పాట.. కూడా సూపర్ డూపర్ హిట్టయిపోతుందనుకున్నారంతా. ఇప్పుడు రంగస్థలం పాటలన్నీ బయటకు వచ్చేశాయి. అయితే జిగేల్ రాణి.. అనే ఐటెమ్ పాట మాత్రం అనుకున్నంత స్థాయిలో లేకపోవడం కాస్త నిరాశ పరిచింది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ కాస్త ఫన్నీగానే ఉన్నా.. ట్యూను వినగానే ఆకట్టుకొనేలా లేదు. గొంతులు కూడా కొత్తగా, వింతగా ఉన్నాయి. ఐటెమ్ పాటలో వినగానే ఎక్కేసే.. క్వాయినింగ్ ఉంటుంటుంది. దేవికి అలాంటి క్వాయినింగ్లు సృష్టించడం చాలా ఇష్టం. అయితే జిగేల్ రాణి అనే క్వాయినింగ్ మాత్రం సరిగా సెట్ కాలేదేమో అనిపిస్తోంది. ఐటెమ్ పాటలో ఉండాల్సిన కిక్ ఈ పాటలో లేకపోవడం మెగా ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరిచేదే. 1985 నాటి కథ కావడం, అప్పటి బోగం మేళాల్ని దృష్టిలో పెట్టుకుని పాటని కంపోజ్ చేయాల్సిరావడం, అప్పటి ఇనిస్టిమెంట్లనే వాడడం వల్ల… ఈ పాట మరీ ముతకగా అనిపించి ఉండొచ్చు. తెరపై చరణ్, పూజాలు మ్యాజిక్ చేయగలిగితే తప్ప ఈ జిగేల్ పాట.. జిగేల్ అనిపించడం కష్టం.