రంగస్థలం సినిమా హిట్ అవడం లో పాటలు ఎంత ప్రధాన పాత్ర పోషించాయో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా ఆడియో లో ఉన్న ఒక హిట్ పాట లో ఒక పదాన్ని మార్చడం ఆశ్చర్యం కలిగించింది.
“రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడో, పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు..గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే..” ఇలా సాగుతుంది పాట. అయితే ఆడియో విడుదలయ్యాక ఈ పాట పై అభ్యంతరాలు వచ్చాయి. ప్రత్యేకించి యాదవ సంఘాలు “గొల్లభామ” అనే పదం పై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ పదాన్ని తీసివేసి తీరాల్సిందేనంటూ పట్టుబట్టాయి. గొల్లభామ అనే పదం యాదవ స్త్రీలను ఉద్దేశించినట్లుగా ఉందంటూ గొడవ చేశాయి. ఆ పదాన్ని ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వాడడం లేదని, అలాంటి పదాన్ని వా డి యాదవ స్త్రీలని కించపరచ వద్దని విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై స్పందించిన గీతకర్త చంద్రబోస్, “గొల్లభామ” అనే పదం యాదవ స్త్రీలను ఉద్దేశించి కాదని, గొల్లభామ అనే పేరుతో ఒక పురుగు ఉందనీ, ఈ పాట సందర్భం లో, అంటే గొల్లభామ అనే పదం ఆ పురుగుని ఉద్దేశ్యించిందనీ వివరణ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్ కూడా ఆకుపచ్చ రంగులో ఉండే ఆ గొల్లభామ అనే పురుగు ని ఉద్దేశించి ఆ పదం వాడామని వివరించారు. అయితే యాదవ సంఘాలు ఆ పదాన్ని తొలగించాల్సిందే అంటూ పట్టుబట్టారు.
మొత్తానికి ఏమైందో ఏమో తెలిదు కానీ, నిన్నవిడుదలైన సినిమాలో ఆ పదాన్ని మార్చి వ్రాశారు. గొల్లభామ అనే పదం ఉన్నచోట గోరువంక అనే పదం వాడారు. దీంతో “గోరువంక వచ్చి నా గోరు గిల్లగానే” అన్నట్టుగా పాట మారిపోయింది.