తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5
రంగుల రాట్నం అన్నది నిన్నటి జాతర్లతో పిల్లల ఆటల అయిటమ్. జెయింట్ వీల్ అన్నది ఇప్పటి జనరేషన్ వ్యవహారం. కానీ సినిమాల విషయంలో మాత్రం ఇప్పటికీ రంగులరాట్నంలా గిర్రున తిరిగేసి, సినిమా అయిపోయిందనిపించాలి కానీ, జెయింట్ వీల్ మాదిరిగా మీదకీ ఎక్కుతూ, కిందకు దిగుతూ వున్నట్లు వుండకూడదు. అలా వుంటే ప్రేక్షకుడి దృష్టి కాస్సేపు తెరమీదా, మరి కాస్సేపు ఫేస్ బుక్, వాట్సప్ పోస్టింగ్ ల మీద వుంటుంది. దాంతో సినిమా కలిగించాల్సిన ఫీల్ కలిగించదు. ఈ సంక్రాంతికి విడుదలైన రంగులరాట్నం సినిమాది ఇదే సమస్య. రంగుల రాట్నం అని మాంచి క్యాచీ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా సబ్జెక్ట్ కూడా కాస్త క్యాచీనే. ప్రేమకు ముందు, పెళ్లికి తరువాత అబ్బాయిలకు అమ్మాయిల నుంచి ఎదురయ్యే సమస్యలే ఈ సినిమా సబ్జెక్ట్. అందువల్ల యూత్ కు చాలా వరకు ఇట్టే కనెక్ట్ అయిపోయే సబ్జెక్ట్ నే.
కథ :
విష్ణు (రాజ్ తరుణ్) తల్లి (సితార) నీడలోనే పెరిగిన కుర్రాడు. తల్లిని, తనను వేరు చేయని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ వుంటాడు. కీర్తి (చిత్ర శుక్లా) చాలా పద్దతి గల అమ్మాయి. అన్నీ పద్దతిగా జరగాలనుకుంటుంది. అలాంటి అమ్మాయికి ఇలాంటి అబ్బాయికి స్నేహం కుదురుతుంది. ప్రేమ పెళ్లిగా మారుతుంది అనుకునే టైమ్ లో విష్ణు తల్లి మరణిస్తుంది. దాంతో బాగా నీరసపడిపోయిన విష్ణు ప్రేమకు ఓకె చేప్పి దగ్గరవుతుంది కీర్తి. అక్కడి నుంచి రెండో అంకం స్టార్ట్ అవుతుంది. కీర్తి తీసుకునే విపరీతమైన కేరింగ్ తో కిందా మీదా అయిపోతాడు. ఆఖరికి ఆమెకు బ్రేకప్ చెబుతాడు. కానీ అంతలోనే ఆమె కేరింగ్ లో తన తల్లి ప్రేమ లాంటి అభిమానం దాగి వుందని తెలుసుకుని మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తాడు.
ఇదీ కథ.
విశ్లేషణ :
కొత్త దర్శకురాలు శ్రీరంజని అనుకున్న ప్లాట్ బాగానే వుంది కానీ దాన్ని అల్లుకోవడమే బాగా లేదు. సినిమాకు అతి పెద్ద మైనస్ హీరోయిన్ పాత్ర చిత్రీకరణ, దానికి ఎంపిక చేసుకున్న కొత్త అమ్మాయి. హీరోకి పెద్ద అక్క మాదిరిగా వుంది కానీ ప్రేయసి లుక్ లేదు. పైగా ఆ క్యారెక్టరైజేషన్ లోంచి, ఆ ఓసిడి..ఓవర్ కేరింగ్ డిసీజ్ లోంచి ఫన్ ను పిండాలి తప్ప, సెంటిమెంట్ ను కాదు. కానీ దర్శకురాలు ఎంచుకున్న నటి హావభావాలు, ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు, సీరియస్ గా వుంటాయి. హీరోకి పరిచయం కాక ముందు హీరోయిన్ సదా సీరియస్ గా వుంటుంది. పరిచయం అయిన తరువాత ఫాథటిక్ లుక్స్ లోకి మారిపోతుంది. సినిమాలో హీరోయిన్ నవ్వు మొహం కోసం ప్రేక్షకులు మొహం వాచిపోవాలి తప్ప కనిపించదు.
సినిమా తొలిసగం తల్లీ కొడుకుల మధ్య సాగిపోతుంది. ఆ వ్యవహారం అంతా కాస్త స్మూత్ గానే వుంటుది. విషయం తక్కువ. కానీ తల్లీ కొడుకులు, లవర్స్ ఇలా రెండు భాగాలు చేసి, రెండు పార్ట్ లతో సినిమా చేయాలని స్క్రిప్ట్ తయారుచేసుకోవడం అంత కరెక్ట్ కాదేమో? ఇలా చేయడం వల్ల అసలు తొలిసగం కథ, మలి సగం కథకు కనెక్షన్ ఏముందీ అనిపిస్తుంది. తల్లిపోవడానికి, ప్రియురాలు కేరింగ్ కు అస్సలు సంబంధం వుండదు. ప్రియురాలు ఆమె చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ తో ఈ కేరింగ్ అబ్సెషన్ లోకి వెళ్తుంది. నిజానికి తల్లి క్యారెక్టర్ ను చంపకుండా కూడా సినిమాను కొనసాగించవచ్చు. అసలు అలా చేసి వుంటేనే ఈ సెంటిమెంట్ డోస్ తగ్గి వుండేదేమో? తల్లి చనిపోయిన బాధలో ఆమె తోడు కావాలని ఎక్స్ ప్రెస్ చేసినట్లే కాకుండా, అంతకు ముందే డిసైడ్ అయినందున, మామూలుగా కూడా ఎక్స్ ప్రెస్ చేసినట్లు చూపించవచ్చు. అప్పుడు తల్లి కూడా వుంటే కాస్త విషాదం పాలు తగ్గి వుండేది. ఎందుకంటే ఈ ఏడుపు హీరోయిన్ పాత్ర కన్నా ఆ తల్లి పాత్రే కాస్త నవ్వులు పూయించింది కనుక.
సినిమా తొలిసగంలో హీరో, అతని స్నేహితుడు (దర్శి) క్యారెకర్ల వల్ల కాస్త హుషారు వుంటుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర వచ్చే వ్యవహారంతో ద్వితీయార్థంలో వారి వినోదానికి బ్రేక్ పడుతుంది. అప్పుడు హీరోయిన్ వ్యవహారం ఈ లోటు ను భర్తీ చేస్తుంది అనుకుంటే, మరింత విషాదంలోకి నెడుతుంది. మరోపక్క సినిమాలో ద్వితీయార్థంలో విషయం వేరే రూట్లోకి వెళ్తుంది,. ఈ మధ్యనే చూసిన మహానుభావుడు సినిమా గుర్తుకు వస్తుంది. ఇక్కడ సరైన సన్నివేశాలు రాసుకోవడంలో, ఎగ్జిక్యూషన్ లో దర్శకురాలు విఫలమయ్యారు.
టోటల్ గా చూసుకుంటే విషయం వున్న సబ్జెక్ట్ నే. కానీ దీన్ని ఫన్ రైడర్ గా తయారుచేయాలి. తప్ప ఇలా ఎగుడుదిగుడుల జెయింట్ వీల్ మాదిరిగా కాదు. సినిమాలో దర్శి, రాజ్ తరుణ్ వున్న సీన్లు అన్నీ జెయింట్ వీల్ లో ఆకాశం అంత ఎత్తుకు వెళ్లిన ఫీలింగ్ ఇస్తాయి. హీరో, హీరోయిన్ సీన్లన్నీ ఆ టెంపోను అమాంతం కిందకు దింపేస్తాయి.
నటీనటుల ప్రతిభ :
కచ్చితంగా రాజ్ తరుణ్ ది బెస్ట్ అన్నట్లు నటించాడు. అసలు నటించినట్లే కనిపించదు. బాగా చేసాడు. తల్లి చనిపోయిన సీన్లు అతనిలోని టాలెంట్ ను ఎత్తి చూపాయి. దర్శి తన కామెడీ డైలాగ్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ చిత్ర బాగానే చేసినా, ఆమె క్యారెక్టర్ డిజైనింగ్ వల్ల మైనస్ మార్కులే తెచ్చుకుంటుంది.
సాంకేతిక వర్గం :
సినిమాలో వున్న మరో లోపం సంగీతం. ప్రేమకథలకు పాటలు, సంగీతం ఆయువుపట్టుగా వుండాలి. ఒక్క పాట బాగుంటే ఒట్టు. పైగా అన్నీ మాంటేజ్ సాంగ్ లే. ప్రేమకథ అన్నాక సరైన డ్యూయెట్ వుండాలి కదా? నేపథ్యసంగీతం కూడా మూడ్ ను స్మూత్ గా ఎలివేట్ చేయడానికి బదులు, కాస్త అమాంతం పైకి ఎత్తే ప్రయత్నం చేసింది. సినిమాను వీలయినంత బడ్జెట్ లో చుట్టే ప్రయత్నం చేసినట్లు క్లియర్ గా తెలిసిపోతోంది. దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా అలాగే వుంది.దాంతో సినిమా మరీ డల్ లుక్ లోకి వచ్చేసింది. కేవలం నాలుగు పాత్రలతోనే సినిమాను నడిపించడం కూడా సినిమాను కాస్త కిందకు లాగేసింది. దీనికి తోడు దర్శకురాలిపై తమిళ రియలిస్టిక్ మూవీస్ ప్రభావం కాస్త వుందనిపిస్తుంది.
తీర్పు :
రంగుల రాట్నం సినిమా సబ్జెక్ట్ కచ్చితంగా యూత్ ను ఆకట్టుకునే విషయం వున్నదే. కానీ దర్శకురాలి అప్రోచ్ మాత్రం యూత్ ఎంటర్ టైనర్ దిశగా కాకుండా, ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ స్టోరీ దిశగా సాగింది. దాంతో సినిమాలో సెంటిమెంట్ పాలు ఎక్కువై పోయింది. దర్శి, రాజ్ తరుణ్ సీన్లే సినిమాను కాపాడాలి. హీరోయిన్ అయితే కచ్చితంగా కాదు.
ఫైనల్ పంచ్
గిర్రున తిరిగింది…?
తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5